వేగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు: మంత్రి ఉత్తమ్
ఎన్డీఎస్‌ఏ సూచనలకు అనుగుణంగా పంటలకు నీరిచ్చేందుకు ప్రయత్నాలు
ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ గేట్లు దించేది లేదు.. అందుకే బ్యారేజీలను సందర్శించాం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి శిక్ష తప్పదు
బ్యారేజీలు, మరమ్మతు పనులను పరిశీలించిన మంత్రి.. అధికారులు, ఏజెన్సీతో సమీక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వానాకాలం సీజన్‌లో పంటలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనలు, సిఫార్సుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. వానాకాలం ఊపందుకునేలోగా ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను, మరమ్మతు పనులను శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన మంత్రి.. తొలుత సుందిళ్ల వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని సందర్శించారు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారానికి చేరుకున్నారు. అక్కడి సరస్వతి బ్యారేజీ వద్ద మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. లక్ష్మి బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పియర్లు, మరమ్మతు పనులను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల కోడ్ ఉండటంతో ఇన్నిరోజులుగా పనులను ఇంజనీరింగ్ అధికారులే పర్యవేక్షించారని చెప్పారు. ఇకపై మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. తాత్కాలిక మరమ్మతు పనులు అన్నారంలో 60శాతం మేర, మేడిగడ్డ వద్ద 80శాతం మేర పూర్తి కావొచ్చాయన్నారు. సుందిళ్లలో నత్తనడకన సాగుతున్న పనుల విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు.
బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందే..
గత ప్రభుత్వం రూ.94 వేల కోట్ల ఖర్చు చేస్తే.. కేవలం లక్ష ఎకరాల ఆయకట్టు తయారైందని.. అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. మా ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై డ్యాం సేఫ్టీ అధికారులను సంప్రదించాం. వారు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. బ్యారేజీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మూడు బ్యారేజీలను గేట్లు ఎత్తి ఉంచాలని, అలా ఉంచితే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లదని చెప్పారు.
ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం..’’ అని తెలిపారు. బ్యారేజీల కుంగుబాటుపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని.. ఆ రిపోర్ట్ ప్రకారం మాజీ ఇరిగేషన్ చీఫ్‌ను విధుల నుంచి తప్పించామని వివరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సీరియస్‌గా ఏ ఒక్క పనీ చేయలేదని ఉత్తమ్ విమర్శించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాం
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేసిన డీపీఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగులోకి వచ్చే ప్రాజెక్టులను త్వరగా చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్, ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.
జియోట్యూబ్‌లతో నీటిని ఆపి, ఎత్తిపోయొచ్చు!
తాత్కాలిక మరమ్మతు పనులు మేడిగడ్డ, అన్నారంలలో వేగంగా నడుస్తున్నాయని, సుందిళ్లలో కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద 5 మీటర్లలో ఎత్తులో జియోట్యూబ్‌లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. అదే అన్నారంలో 11 మీటర్ల ఎత్తులో, సుందిళ్లలో 9 మీటర్ల ఎత్తులో ఆపితే నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment