సాక్షి, అమరావతి: పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వినోద, విహార యాత్రలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణ పాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా విదేశాల్లో ‘ఇంజనీరింగ్ పర్యాటకం’ కొత్త ధోరణిగా అవతరిస్తోంది. వంతెనలు, డ్యామ్‌లు, పోర్టులు, భారీ కట్టడాలు చూసిన వెంటనే సందర్శకులను ఆకర్షిస్తాయి. అటువంటి వాటిల్లో చారిత్రక, వారసత్వ నిర్మాణాల విలువలను భావితరాలకు, యువ ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చేలా పర్యాటకం తోడ్పాటునందిస్తోంది.
విదేశాల్లో ఎక్కువగా..
వంతెనలు, నీటి ప్రాజెక్టులు ఆయా ప్రాంతాలకు చిహ్నాలు. వాటి నిర్మాణం వెనుక కథ ఆసక్తిగా ఉంటుంది. ఎంతో మంది రేయింబవళ్లు ఏళ్లపాటు కష్టపడి చేపట్టిన నిర్మాణాల సంక్లిష్టతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, జర్మనీ, ఇంగ్లండ్‌లు భావితరాలకు అందిస్తున్నాయి. చారిత్రక ఇంజినీరింగ్ ప్రదేశాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాయి. భారీ యంత్రాలు లేని సమయంలో వంతెనలు, డ్యామ్‌ల రూపకల్పనకు సంబంధించిన ఆనాటి సాంకేతికత విలువలను మ్యూజియంల రూపంలో భద్రపరుస్తున్నాయి.
వీటిని ప్రజలు సందర్శించేలా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతున్నాయి. చైనాలో ప్రతి వంతెనకు ఒక మ్యూజియం ఉంటుంది. ఆ వంతెన ముఖ్య విషయాలను అందులో ప్రదర్శిస్తారు. భారత్‌లో అయితే ఏపీలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ విశేషాలను, నమూనాలను ప్రదర్శించేందుకు, యూపీలో పాత నైనీ బ్రిడ్జికు ప్రత్యేక మ్యూజియంలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు..
సమాజ సంస్కృతి, అభివృద్ధి శ్రేయస్సుకు మూల స్తంభాలుగా డ్యామ్‌లు, వంతెనలు నిలుస్తున్నాయి. రోడ్డు వంతెన అయినా..రైలు వంతెన అయినా, సైన్యం నిర్మించినది అయినా, సస్పెన్షన్ బ్రిడ్జిలు, సపోర్డెట్ బ్రిడ్జ్‌లు, కంటిన్యూస్ స్పాన్ బ్రిడ్జిలు దేశంలో, రాష్ట్రంలో అనేకం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ పర్యాటకంలో ఇంజనీరింగ్ టూరిజం కేవలం 2.28 శాతం మాత్రమే. అయినప్పటికీ వాటికున్న ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలైన డ్యామ్‌లు, రిజర్వాయర్లు, సైన్స్ సెంటర్లు, హార్బర్లు, పోర్టులు, వంతెనలను విదేశీ తరహా పర్యాటకంగా అభివృద్ధికి కసరత్తు చేస్తోంది.
ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాధాన నిర్మాణాలతోపాటు వివిధ రిజర్వాయర్లు, వంతెనల టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించనుంది. రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి గోదావరి అందాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో సబ్‌మెరైన్, జెట్ మ్యూజియంలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రణాళిక ప్రకారం అభివృద్ధి
రాష్ట్రంలో అపార పర్యాటక వనరులు ఉన్నాయి. వాటిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలను కూడా పర్యాటక స్థలాలుగా గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం.
– ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment