
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఏ పనులు చేయాలనేది నిర్ధారిస్తూ విభాగాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే జాబ్ చార్ట్‌లను విడుదల చేసింది. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులకు సంబంధించి జాబ్ చార్ట్‌ను కూడా రూపొందించింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కుళాయిల ద్వారా తాగునీటిని విడుదల చేసే సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విధిగా నీటి పరీక్షలు నిర్వహించాలి. సచివాలయ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సదరు ఉద్యోగి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ చార్ట్ పేర్కొన్న పనుల వివరాలివీ...
- రోజూ ఉదయాన్నే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. తన సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యకలాపాలు, పనుల నాణ్యతను తనిఖీ చేయాలి.
- పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే గుర్తించి సంబంధిత ఇంజనీరింగ్ శాఖకు తెలియజేయాలి.
- తాగునీటి పైపు లైన్లలో లీకేజీలను గుర్తించి వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాలి.
- పంప్ హౌస్‌లు, సర్వీసు రిజర్వాయర్లను తనిఖీ చేయాలి. పైప్‌లైన్ చివరి పాయింట్ వరకు నీటి సరఫరా జరుగుతోందా లేదా పరిశీలించాలి.
- గృహ నిర్మాణాలతో పాటు సివిల్ పనులన్నిటినీ అమలు చేయించాలి. సివిల్ పనులు, గృహ నిర్మాణాల్లో ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించి మూవ్‌మెంట్ రిజిస్టర్ నిర్వహించాలి.
- రహదారుల నిర్వహణ పనులను గుర్తించాలి. ఎక్కడైనా గుంతలు పడితే పూడ్చేందుకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను రూపొందించాలి.
- స్పందనలో వచ్చిన సమస్యలపై నోట్‌ను రూపొందించాలి. ఆయా గ్రామాల సమస్యలను కూడా నోట్‌లో పొందుపరిచి పరిష్కారం నిమిత్తం పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి.
- పారిశుధ్య నిర్వహణ, కార్యకలాపాలు, వ్యర్థాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలి.
- భవన నిర్మాణాల అనుమతి దరఖాస్తుల ఆధారంగా సాంకేతిక తనిఖీలను నిర్వహించాలి.
- డ్రెయినేజీ, వాటర్ ట్యాంక్‌లో నూటికి నూరు శాతం పూడిక తీయించాలి.
- గృహాలతో పాటు మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను అంచనాలతో రూపొందించాలి.
- క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా పనుల అమలు తీరుతెన్నులను ఫీల్డ్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. పనుల పురోగతి ఫొటోలు కూడా తీయాలి.
- క్షేత్రస్థాయి కార్యకలాపాలను డాక్యుమెంటేషన్ చేసి ప్రజాప్రతినిధులకు ప్రతిరోజూ అందించాలి.
- ఇంజరింగ్ విభాగాలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ పరిరక్షించాలి.
- పనులకు సంబంధించిన టెండర్ అగ్రిమెంట్ల విషయమై పంచాయతీ కార్యదర్శితో సంప్రదింపులు జరపాలి. బిల్లుల రూపకల్పన, క్వాలిటీ కంట్రోల్ నివేదికలను రూపొందించాలి.
- స్వచ్ఛ ఆంధ్రాతో పాటు ఇతర కార్యకలాపాలకు హాజరు కావాలి. వర్షాకాలంలో ట్యాంకులు, రహదారులకు గండ్లు పడితే యుద్ధప్రాతిపదికన పనులు చేయించి మంచినీటి సరఫరాకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
- వేసవిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను పర్యవేక్షించాలి.
- రహదారులు, భవనాలు, స్కూల్స్ నిర్వహణ పనులను పర్యవేక్షించాలి. ప్రభుత్వ భవనాలు, స్కూలు భవనాలను తనిఖీ చేస్తూ తరచూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment