
ఏ, బీ, సీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణ
సచివాలయ కేటగిరీని బట్టి సిబ్బంది కేటాయింపు
సాధారణ విధులు, నిర్దిష్ట విధులకు వేర్వేరుగా సిబ్బంది
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల కేటగిరీని బట్టి సిబ్బంది సంఖ్యను సైతం నిర్ధారించింది. 2,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘ఏ’ కేటగిరీ, 2,501 నుంచి 3,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘బీ’, 3,501కు మించి జనాభా ఉన్న సచివాలయాలను ‘సీ’ కేటగిరీలో చేర్చింది. ఏ కేటగిరీ సచివాలయాలకు ఆరుగురు సిబ్బందిని కేటాయించగా.. ఇందులో ఇద్దరు సాధారణ, నలుగురు నిర్దిష్ట విధులకు వినియోగించాలని నిర్దేశించింది.
బీ కేటగిరీ సచివాలయాలకు ఏడుగురు సిబ్బందిని కేటాయించగా.. వీరిలో ముగ్గురు సాధారణ, నలుగురు నిర్దిష్ట విధులకు వినియోగించాలని పేర్కొంది. సీ కేటగిరీ సచివాలయాలకు 8 మంది సిబ్బందిని కేటాయించగా.. వీరిలో నలుగుర్ని సాధారణ విధులకు, మరో నలుగుర్ని నిర్దిష్ట విధుల కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా సచివాలయాలను, సిబ్బందిని హేతుబద్దీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సిబ్బంది విధులు ఇలా..
» గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» పట్టణాల పరిధిలోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» గ్రామ సచివాలయాల్లో నిర్దిష్ట విధులను గ్రామ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఇంధన అసిస్టెంట్ నిర్వర్తిస్తారు.
» వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట విధులను రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ కార్యదర్శి, ప్లానింగ్–రెగ్యులేషన్ కార్యదర్శి, సౌకర్యాల కార్యదర్శి, పారిశుధ్య–పర్యావరణ కార్యదర్శి, ఇంధన కార్యదర్శి నిర్వర్తిస్తారు.
కేటగిరీల వారీగా విధులు ఇలా..
» ఏ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్ కార్యదర్శి, సంక్షేమ విద్య అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» పట్టణాల్లోని ఏ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి లేదా విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» బీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్, పట్టణాల్లోని బీ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» సీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి, మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు.
» ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సాధారణ విధులు నిర్వర్తించే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.
» నిర్దిష్ట విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించి విడిగా ఉత్తర్వులిస్తామని పేర్కొంది.