ఇరిగేషన్ లెక్క తేలింది!
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి పారుదల శాఖలో పోస్టులు, ఉద్యోగుల లెక్క తేలింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో ఉన్న పోస్టులు, ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం సోమవారం చీఫ్ ఇంజనీర్ల (సీఈల) సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎవరు ఏ రాష్ట్రంలో పనిచేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 5 ఈఎన్‌సీలు, 33 సీఈ పోస్టులు ఉన్నాయి.
ఇంజనీరింగ్ విభాగంలో 7,986 పోస్టులు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖలో మొత్తం 34,486 పోస్టులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ శాఖలో ఉన్నతాధికారుల పోస్టులు ప్రాంతాలవారీగానే ఉన్నాయి. కాడాకు ఒక కార్యదర్శి ఉండగా, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రా ప్రాజెక్టుల పర్యవేక్షణకు వేర్వేరుగా కార్యదర్శులు ఉన్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు (ఈఎన్‌సీలు) కూడా ఇదే మాదిరిగా ఉన్నారు. పరిపాలన విభాగానికి ఒక ఈఎన్‌సీ ఉండగా, ఇరు ప్రాంతాలకు ప్రత్యేక ఈఎన్‌సీలు ఉన్నారు. వాలంతరి, ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్), జలవనరులు వంటి విభాగాలకు మాత్రమే ఉమ్మడి ఈసీలు ఉన్నారు.
నీటి వనరుల వాటాపై సిద్ధమైన నివేదిక: రాష్ర్టంలోని వివిధ నదుల బేసిన్లలో ఉన్న నీటి వనరులు, వాటి పంపకాలకు సంబంధించిన సమాచారంతో అధికారులు ఓ నివేదికను సిద్ధం చేశారు. వివిధ నదులపై బచావత్ అవార్డు ప్రకారం పంచిన నీటి వివరాలనే ఇందులో పొందుపరిచారు. భారీ ప్రాజెక్టుల పరిధుల్లోనే కాక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు కుంటలు, చెరువుల పరిధిలో కూడా నీటి వాడకాన్ని అంచనా వేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఎగువ ప్రాంతం నుంచి రావాల్సిన నీరు ఎంత? రాష్ట్రంలో ఉన్న నీటి లభ్యతలను అంచనా వేశారు. ఈ నీటిలో ఏయే ప్రాంతానికి ఎంతెంత వాటా ఉందన్న విషయాన్ని ప్రాజెక్టులవారీగా నివేదికలో పొందుపరిచారు.