నదిలేని మెతుకుసీమకు నీరొద్దా?
- రైతులు కరువుతో అల్లాడాలా?
- విపక్షాలపై మంత్రి హరీశ్ ఫైర్
సిద్దిపేట : ‘‘నది లేని మెదక్ జిల్లాకు సాగునీరు వద్దా? మెతుకుసీమ కరువుతో అల్లాడాల్సిందేనా? రైతుల ఆకలి చావులు, ఆత్మహత్యలు, ముంబై వలసలు కొనసాగాల్సిందేనా?...’’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రాజెక్టులు కడితే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేక కుట్రలు పన్నుతున్నాయని, ఆ పార్టీలకు పుట్టగతులుండవని దుయ్యబట్టారు. నది లేని చోట రిజర్వాయర్లు కట్టి నిష్ర్పయోజనమని ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయనకు వత్తాసుగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం అర్థరహితమన్నారు.
ఆదివారం సాయంత్రం సిద్దిపేటలో.. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి 341 మంది రైతులకు రూ.37.74 కోట్ల పరిహారాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, ముంబై వలసలతో మెతుకు సీమ అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ‘‘నదిలేని చోట ప్రాజెక్టులు కట్టడం వ్యర్థమని వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు వెలిగొండ లో 40 టీఎంసీలు, ఎస్సారెస్పీపై 10 టీఎంసీల గోరాకల్, సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా 7 టీఎంసీల అవుకు, అల్గానూర్ రిజర్వాయర్‌లు ఎలా కట్టారు? వీటికి ఎక్కడ నదులున్నాయి? గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా రిజర్వాయర్లు కట్టిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం హక్కుపూరిత ధోరణితో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోంది. మల్లన్నసాగర్ ద్వారా రైతుకు తాగు, సాగునీరు అందిస్తాం. కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదు. అందుకే ఇంజనీరింగ్ శాఖ పరిశీలన మేరకు రిజర్వాయర్లను కడుతున్నాం’’ అని వివరించారు.
వారిది మూడో పంట తాపత్రయం
పులిచింతల కోసం 13 గ్రామాలను ముంచి, పోలవరం కోసం 6 మండలాలను లాక్కున్న సీమాంధ్రులు మూడో పంట కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండో పంట కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం అర్థరహితమన్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి సిద్దిపేట నియోజకవర్గానికి గోదావరి జలాలను తరలించి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో భూసేకరణలో భూమి కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి పునరావ ృతం కాకుండా తమ ప్రభుత్వం జీవో 123 ద్వారా మెరుగైన, సత్వర పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ జీవోను విమర్శిస్తున్న నాయకులు సింగూరు భూనిర్వాసితులు 30 ఏళ్ల నుంచి పడుతున్న వ్యథపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మిడ్‌మానేరు భూసేకరణ బాధితులు 12 సంవత్సరాలుగా పరిహరం కోసం ఎదురుచూస్తున్నారని, ఎల్లంపల్లి భూ నిర్వాసితులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. నంగునూరు మండలం కౌడాయిపల్లి కెనాల్ నిర్మించి నేటికీ 15 సంవత్సరాలు గడిచాయన్నారు. ఇన్నేళ్లు పరిహారం కోసం ఎదురుచూసిన వారికి తమ ప్రభుత్వంలో పరిష్కారం లభించిందన్నారు.
ఇంజనీర్.. హరీశ్‌రావు
మంత్రి హరీశ్ రావు ఇంజనీర్ ఆవతారమెత్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర రూపాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించారు. రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లపై దాదాపు అరగంటపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులను వెంకటాపూర్ సొరంగంలోకి తీసుకెళ్లి పనులను దగ్గరుండి చూపించారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అప్పటి రూపం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీడిజైన్ చేసి చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. రంగనాయక్ సాగర్ కుడి కాలువ నిర్మాణ పనులకు భూసేకరణ నిర్వహించాల్సి ఉందని, అందుకు నంగునూరు మండల ప్రజాప్రతినిధులు చొరవ చూపి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.