పనులు ముందు..టెండర్లు తర్వాత
ఒంగోలు అర్బన్ : ఒంగోలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అంతా తమ ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తోంది. సివిల్ వర్కులకి సంబంధించిన టెండర్ల విషయంలో ఎంఈతో పాటు ఇతర అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థకి ఓపెన్‌టెండర్ల వలన రావాల్సిన 20 నుంచి 30 శాతం మిగులు ఆదాయానికి గండిపడుతోంది. కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకే పనులు కేటాయించాలనే ఉద్దేశంతో ఇంజినీరింగ్ విభాగం నిబంధనలను తుంగలో తొక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టెండర్లు ఖరారు కాకుండానే...
పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయకుండానే కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లకు ముందుగానే పనులు కేటాయించి... ఆ పనులు చేస్తుండగా టెండర్లు ఏవిధంగా ఖరారు చేస్తారని కొందరు కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అడ్డగోలు విధానం వలన పనులకు సంబంధించిన ఎంబుక్స్‌లో కూడా వారికి అనుకూలమైన తేదీలు వేసుకొని మరీ నమోదు చేయాల్సి వస్తుందని పలువురు కాంట్రాక్టర్లు, మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ ఉండే హెడ్ క్వార్టర్స్‌లోనే ఉన్నా ఏమాత్రం జంకు లేకుండా ఈ విధంగా అడ్డగోలుగా ముందు పనులు కేటాయించి తర్వాత టెండర్లు పిలుస్తున్నారంటే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
- సక్రమంగా బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు వక్రమార్గంలో పనిచేస్తూ నగరపాలక సంస్థకి నష్టం తెస్తుంటే మరోవైపు నగర ప్రజలపై అధిక మొత్తంలో పన్నులు పెంచి భారం మోపుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ సుజాత శర్మ ఈ అవకతవకలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోకుంటే నగరపాలక సంస్థకి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది.
- ఈ నెల 7వ తేదీ రూ.73.31 లక్షల విలువైన మొత్తం 13 పనులకు సంబంధించిన టెండర్లు నమోదయ్యాయి. వీటిలో ఏ ఒక్క టెండరూ ఖరారు కాలేదు.
- ఏ కాంట్రాక్టర్‌కీ వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు. అయినా ఆ 13 పనుల్లో కొన్ని పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఇంజినీరింగ్ విభాగం ఏవిధంగా పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతుంది.
టెండర్లు ఖాయం కాకుండా ముందుగా జరుగుతున్న పనులు ఇవీ...
- కమ్మపాలెంలో కరవది డొంక పోతురాజు కాలువ వద్ద ఉన్న శ్మశాన వాటిక ప్రహరీ, రంగులకి సంబంధించి రూ.4,40,171 లక్షల విలువైన పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇంతవరకు టెండర్ ఖరారు కాలేదు. అక్కడే రూ.4,49,625 లక్షల విలువైన డ్రైనేజి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
- స్థానిక బాలకృష్ణాపురంలో రూ.4,51,147 లక్షలతో సిమెంట్ రోడ్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన టెండరు ఖరారు కాలేదు.
- రంగారాయుడు చెరువు, గాంధీపార్కు వద్ద రూ.3,14,333 లక్షల విలువైన ట్రాక్ లైటింగ్ పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికి 20 అడుగుల లైటింగ్ పోల్స్, 10 అడుగుల లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ పనులకు టెండర్ ఖరారు కాలేదు.