టీఎస్ ఎంసెట్-2015 వెబ్ కౌన్సెలింగ్ | TS EAMCET 2015 Rank Wise Web Counselling | Sakshi
Sakshi News home page

టీఎస్ ఎంసెట్-2015 వెబ్ కౌన్సెలింగ్

Published Wed, Jun 17 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం)- 2015 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది.

 తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం)- 2015 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన 1,04,373 అభ్యర్థులకు.. పరీక్షలో ఉత్తీర్ణత  కోసం ఎంత కృషి చేశారో.. అంతే స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై, వెబ్ ఆప్షన్స్ ఎంపికలో అప్రమత్తతో వ్యవహరిస్తూ సరైన కాలేజీని, కోర్సును ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ విషయంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలు..
 
 టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలి దశ అయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేడు ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ర్యాంకుల ప్రకారం పేర్కొన్న హెల్ప్‌లైన్ సెంటర్లకు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాలి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నిటిని ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆ హెల్ప్‌లైన్ సెంటర్లలోనే హాజరు కావాలి.
 
 స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు:
 ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
 
 సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి:
 వెబ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవుతున్న అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు..
 టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్
 టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్
 ఇంటర్మీడియెట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్
 టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో

 నాన్ లోకల్ విద్యార్థులై, తల్లిదండ్రులు పదేళ్లుగా తెలంగాణలో నివసిస్తుంటే సంబంధిత రెసిడెన్స్ సర్టిఫికెట్ 2015, జనవరి 1 తర్వాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం  ఆధార్ కార్డ్ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు.. నిర్దేశిత అధికారులు జారీచేసిన సర్టిఫికెట్లు. ఒరిజినల్ కాపీలతోపాటు రెండు సెట్ల జి రాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
 
 రిజిస్ట్రేషన్ టు వెబ్ ఆప్షన్స్:
 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరవ్వాలి. నిర్దేశిత ఫీజు చెల్లించి (ఓసీ/బీసీ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.400) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత తమ ర్యాంకును పిలిచినప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ వద్ద తమ ధ్రువపత్రాలను తనిఖీ చేయించుకుని రిసీట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫామ్ తీసుకోవాలి. అందులోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దీని ఆధారంగానే తదుపరి దశలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి వీలవుతుంది.
 
 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ:
 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు తమ ర్యాంకుల ఆధారంగా నిర్దేశిత తేదీల్లో వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ (కాలేజీ, కోర్సుల ప్రాధాన్యతలు) ఇచ్చే అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించి దశల వారీ ప్రక్రియలు..
 
 ముందుగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయాలి. తర్వాత తమ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలతో పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోని లాగ్ అవుట్ అవ్వాలి. తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి.. తాము సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు పంపిన లాగిన్ ఐడీ, తాము జనరేట్ చేసుకున్న పాస్‌వర్డ్ వివరాలు పొందుపరిచి డిస్‌ప్లే ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ బటన్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు కళాశాలలు, కోర్సుల వివరాలతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ఆధారంగా వాటిని పూరించాలి. ఇలా ఎన్ని ఆప్షన్లయినా ఇవ్వొచ్చు. ఎలాంటి పరిమితి లేదు.
 
 అన్ని ఆప్షన్లు ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ లాగ్ అవుట్, కన్‌ఫర్మ్ అండ్ లాగ్ అవుట్ బటన్‌లపై క్లిక్ చేస్తే తాము ఇచ్చిన ఆప్షన్లతో కూడిన ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకుని లాగ్ అవుట్ అవ్వొచ్చు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఎన్నిసార్లయినా లాగిన్ అయి ఆప్షన్లు మార్చుకోవచ్చు. అదే విధంగా ఆప్షన్ల ఎంట్రీ తేదీలు ముగిసిన తర్వాత కూడా తాము ఇచ్చిన ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలి.
 
 సీట్ అలాట్‌మెంట్
 అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, వారి ర్యాంకు అందుబాటులో సీట్లు ఆధారంగా సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. దీనికి నిర్దేశిత తేదీలు ప్రకటిస్తారు. ఆ తేదీల్లో వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకొని, సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్లో లేదా అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత కళాశాలలో చేరినప్పుడు మాత్రమే ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. తొలి దశలో సీటు లభించి రిపోర్ట్ చేసినా మలి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనొచ్చు.
 
 ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్ ఎంపిక
 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి సమయం అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీ, బ్రాంచ్ విషయంలో కసరత్తు చేయాలి. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళాశాలలకు సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా అభ్యర్థులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందే ఉంటుంది. కాబట్టి వాటిని వెల్లడించగానే సదరు కళాశాలల నాణ్యత, ప్రమాణాల గురించి పరిశీలించి మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి. పీజీ కోర్సులు కూడా ఉన్న కళాశాలలైతే ల్యాబ్స్, ఫ్యాకల్టీ పరంగా మరింత సదుపాయాలు ఉంటాయి.
 - ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు,
 టీఎస్ ఎంసెట్-2015 కన్వీనర్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement