
మార్పు లేనట్టే!
- ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 40 శాతమే
- వైద్యుల నిర్లక్ష్యమే కారణం
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో 57 శాతం
సాక్షి, అనంతపురం : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిపి మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ‘మార్పు’పై వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు మించి అదనంగా ప్రసవాలు చేసిన సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. లక్ష్యాలను అధిగమించడం సంగతి అటుంచితే ఒక్క ప్రసవం కూడా జరగని ఆస్పత్రులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.
జిల్లాలో 80 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు, 4 ఏరియా ఆస్పత్రులు, జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రి (హిందూపురం) ఒకటి, అనంతపురం సర్వజనాస్పత్రి ఒకటి ఉన్నాయి. కాగా ప్రైవేటు ఆస్పత్రులు 500 వరకు ఉన్నాయి. వైద్యపరంగా గణనీయమైన మార్పులు వచ్చి ప్రభుత్వాస్పత్రులలో ఎంతో విలువైన పరికరాలు సైతం సమకూర్చుతున్నా కనీసం ప్రసవాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నారు. వైద్య సిబ్బందికితోడు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల సహాయం కూడా తీసుకుంటున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని నాలుగేళ్ల గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2011 నుంచి 2014 ఆగస్టు వరకు జిల్లాలో 2,63,727 ప్రసవాలు జరగ్గా.. అందులో పీహెచ్‌సీలలో మాత్రమే 1,06,606 (40.42 శాతం) ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రులలో 1,50,830 (57.19శాతం), ఇళ్ల వద్ద 6297 (2.38శాతం) ప్రసవాలు జరిగాయి.
కారణాలు అనేకం
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరగక పోవడానికి ప్రధాన కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. గర్భిణులు పరీక్షల నిమిత్తం వచ్చినపుడు స్వయంగా వైధ్యాధికారి పరీక్షించి మందులను ఇవ్వడంతో పాటు తగిన సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలకు వచ్చేలా మనోధైర్యాన్ని కల్పించాలి. అయితే గర్భిణులు ప్రసవాలకు ఆస్పత్రులకు వస్తే వైద్యులు అందుబాటులో ఉండని సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ ఏడాది జులైలో గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన శివప్ప భార్య వడ్డే ఈశ్వరమ్మ ప్రసవ వేదనతో బాధపడుతూ గుమ్మఘట్ట పీహెచ్‌సీకి వచ్చింది.
ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొత్తగా ఆస్పత్రికి వచ్చిన స్టాఫ్‌నర్సు, స్వీపర్ కలసి ఈశ్వరమ్మకు కాన్పు చేశారు. కాసేపటికే ఈశ్వరమ్మ పురిటి బిడ్డతో సహా మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, కాంపౌండర్లు, ఇతర సిబ్బందే పెద్ద దిక్కుగా ఉండటంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని, ప్రైవేట్ నర్సింగ్ హోంల వైపు మొగ్గు చూపుతున్నారు. గర్భిణుల నమోదులో చూపిన శ్రద్ధ ప్రసవ సమయంలో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై డీఎంఅండ్‌హెచ్‌ను ఫోన్‌లో సంప్రదించగా తాను బిజీగా ఉన్నానని, మళ్లీ మాట్లాడుతానని ఫోన్ కట్ చేశారు.