భీమవరం, తాడేపల్లిగూడెంలో మూతపడిన సంజీవని ఫార్మసీలు
ఏలూరు (టూటౌన్) : పేద ప్రజలకు మందులు అందుబాటు ధరలో అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీ దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రితో పాటు తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిల్లో సంజీవని ఫార్మసీలను వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రులు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వీటిలో తాడేపల్లిగూడెం, భీమవరం ఫార్మసీలను మూసివేశారు. జంగారెడ్డిగూడెం, తణుకుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఒక్క ఏలూరులోని సంజీవని ఫార్మసీ ఒక్కటే సక్రమంగా సాగుతోంది. ఇక్కడ మాత్రమే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్‌పైర్ అయిన మందులు
సరైన ప్రణాళిక లేకుండా జిల్లా సమాఖ్య లక్షల రూపాయలు వెచ్చించి ముందస్తుగా మందులు కొనుగోలు చేసింది. అయితే వాటి తేదీ ఎక్స్‌పైర్ అయిపోవడంతో వృథాగా మారాయి. భీమవరం, తాడేపల్లిగూడెం ఫార్మసీలు మూతపడడంతో వీటిని పడేశారు. ఏలూరులో రూ.2 లక్షలు విలువైన 108 రకాల మందులు ఎక్స్‌పైర్ కావడంతో వాటిని వెనక్కి పంపివేయడం జరిగింది. ఈ విషయం డీఆర్‌డీఏ అధికారులు జరిపిన విచారణలో బహిర్గతమైంది.
జంగారెడ్డిగూడెం, తణుకు ఫార్మసీల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఏలూరులో సంవత్సరానికి రూ.12 లక్షల మేర అమ్మకాలు జరగడంతో కొద్దిస్థాయిలో లాభాలబాటలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 5 సంజీవని ఫార్మసీల్లో ఈ పరిస్థితులు ఉండగా జిల్లా అధికారులు మాత్రం ప్రతి మండల కేంద్రాల్లో ఫార్మసీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా సరైన నిర్వహణ, పూర్తిస్థాయిలో మందులు లేకపోతే అవి కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.
ఆయుష్‌తీరింది
Published Mon, Sep 8 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement