Sanjeevani pharmacy
-
అయ్యో.. సంజీవిని
శ్రీకాకుళం: జిల్లాలోని అన్న సంజీవిని మందుల దుకాణాలకు ఆదరణ కరువవుతోంది. పేదలకు తక్కువ ధరకే మందులు అందిస్తామని చెబుతూ ప్రభుత్వం అన్న సంజీవిని పేరిట మందుల దుకాణాలను నెలకొల్పేలా చేసింది. 2015 అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుకాణాలను ప్రారంభించారు. తొలుత పురపాలక సంఘాల పరిధిలో ఈ షాపులను ప్రారంభింపజేయించారు. డీఆర్డీఏ పరిధిలోని వెలుగు ఆధ్వర్యంలో జిల్లాలో 25 షాపులను నెలకొల్పేలా చేశారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుప్రతిలో ఒకటి, నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, సోంపేట, రణస్థలం, సంతకవిటి, జలుమూరు తదితర చోట్ల ప్రారంభించారు. వీటిలో గతంలోనే టెక్కలి, సోంపేట దుకాణాలు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగక మూతపడ్డాయి. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలోని మందుల దుకాణం కూడా తెరుచుకోవడం లేదు. మిగిలిన వాటి పరిస్థితి కూడా ఎప్పుడు తీస్తారో, ఎప్పుడో మూసివేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం జనరిక్ మందులపై సరైన ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో అందరూ బ్రాండెడ్ వైపే చూస్తున్నారు. వాస్తవానికి అన్న సంజీవిని దుకాణాల్లో దొరకే జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సరిసమానమైనవి కాగా, ధర కూడా చాలా తక్కువ. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధర తక్కువగా ఉందనడానికి ఉదాహరణకు సాధారణ మెడికల్ షాపుల్లో రూ.115 వరకు ఉండగా జనరిక్ షాపుల్లో కేవలం రూ.20లకే లభిస్తున్నాయి. జనాభాలో 40 శాతం మందికి పైగా వినియోగించే మధుమేహం, బీపీ మందులు కూడా 60 నుంచి 70 శాతం తక్కువగా లభిస్తున్నాయి. కాల్షియం మాత్రలు సాధారణ కంపెనీలకు చెందినవి రూ.60 నుంచి రూ.80 వరకు ఉండగా, అన్న సంజీవిని దుకాణాల్లో రూ.20లకే విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి దానిలోనూ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. అన్న సంజీవిని దుకాణాలు నెలకొల్పినప్పుడు వైద్యులు ప్రిస్కిప్షన్ అర్థమయ్యేలా రాయాలని అవి కూడా బ్రాండ్ పేరు కాకుండా మందు పేరును రాయాలని భారత వైద్య మండలి ఆదేశించింది. అయినా ఎక్కడా దీనిని అమలు చేయడం లేదు. ప్రభుత్వ వైద్యులు సైతం దీనిని పాటించకపోవడం విచారకరం. ప్రైవేటు వైద్యుల విషయం వేరే చెప్పాల్సినపని లేదు. వీరు తమ క్లినిక్‌లకు అనుబంధంగా ఉన్న దుకాణాల్లోనే మందులను కొనుగోలు చేయాలని రోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనివలన ప్రజలు తీవ్ర భారాన్ని మోస్తున్నారు. జనరిక్ మందులకు సాధారణ షాపుల్లో విక్రయించే మందుల ధరల్లో 70 నుంచి 80 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇంతటి ఉపయోగకరమైన అన్న సంజీవిని షాపులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంగానో నిర్లక్ష్యం చేస్తుందనడంలో అవాస్తవం లేదు. ఇప్పటికైనా అన్న సంజీవినిపై ప్రత్యేక దృష్టిసారించి జనరిక్ మందులను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని పలువురు కోరుతున్నారు. -
సంజీవనికి సంకెళ్లు
ప్రకాశం, బేస్తవారిపేట: పేదలను ఆదుకుంటాయనుకున్న జనరిక్ మందులు ముఖం చాటేశాయి. దుకాణాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పేదల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యం కోసం రోజువారీ మందు బిళ్లలకు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన వస్తుంది. బీపీ, షుగరుతో పాటు కీళ్ల, కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మందులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ మందులను వినియోగంలోకి తీసుకొచ్చాయి. దీంతో ఖర్చు తక్కువతో సాధారణ మందులు దొరుకుతాయని అంతా భావించారు. మందులను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఏర్పాటు అంతంత మాత్రమే.. మండల కేంద్రాలతో పాటు, ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సైతం జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వెలుగు, డీఆర్డీఏ అధికారులు మండల కేంద్రాల్లో మాత్రమే ఒక్కో షాపు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా కేవలం 25 జనరిక్ షాపులను మాత్రమే ప్రారంభించారు. షాపులకు తాళాలు డీఆర్డీఏ, వెలుగు–మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే జనరిక్ దుకాణాలు మూతపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నిత్యం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, మండల సమాఖ్య పట్టించుకోకపోవడంతో ఒక్కోటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, గిద్దలూరు, బేస్తవారిపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న సంజీవని జనరిక్ మెడికల్ దుకాణాలు చాలా కాలంగా తెరచుకోవడంలేదు. అత్యంత చౌకగా.. మందుల షాపుల్లో దొరికే మందుల ధరలతో పోల్చితే జనరిక్ మందులు అత్యంత చౌకగా లభిస్తాయి. ముఖ్యంగా రోజువారీ వాడకంలో ఉన్న బీపీ, షుగర్ వ్యాధికి సంబంధించి మాత్రలు బయట మందుల షాపుల్లో అత్యధికంగా ఉంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువకు లభిస్తాయి. బీపీ ట్యాబ్లెట్లు రూ.60–90 ధర ఉంటే జనరిక్‌లో రకాన్ని బట్టీ రూ.8 నుంచి రూ.18లోపు (పది మాత్రలు) లభిస్తాయి. ఇదే విధంగా క్యాల్షియం ట్యాబ్లెట్ల ధరలో రూ.60 వరకు వ్యత్యాసం ఉంటుంది. దగ్గుకు వాడే సిరప్ ధర జనరిక్‌లో రూ.15గా ఉంటే ఇదే బయట మందుల దుకాణంలో రూ.70పైగానే ఉంటోంది. ఇదే విధంగా అన్ని మందుల ధరల్లో వందల రూపాయల్లో తేడా ఉంటుంది. కొన్ని మందుల షాపుల్లో జనరిక్ మందులనే సాధారణ మందులుగా తెలియని వారికి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ పాపం ఏవరిది..? రోజువారీ కూలీకి వెళ్లే కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు వస్తుండటంతో జనరిక్ మందులు బాగా ఉపయోగపడ్డాయి. ఏర్పాటు చేసిన మొదటి రెండేళ్ల కాలంలో మంచి బిజినెస్ జరిగింది. రాను రాను జనరిక్ దుకాణాలకు మందులను సరఫరా చేసే ఏజెన్సీలు తక్కువ గడువు ఉన్న మందులు సరఫరా చేయడం ప్రారంభించాయనే ఆరోపణలు వినిపించాయి. జనరిక్ దుకాణాలకు సక్రమంగా మందులు సరఫరా చేయకపోవడంతో బిజినెస్ తగ్గిపోయిందనే సాకుతో పేదల సంజీవనిలను మూత పడేలా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల జోక్యంతో... అక్కడక్కడా అధికార పార్టీ నాయకుల జోక్యంతో తమ వర్గానికో, బంధువులకో దుకాణాలు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారు. జనరిక్ షాపుల సమస్యలు పరిష్కరించకుండా వదిలివేస్తున్నారు. జనరిక్ దుకాణం మూత పడిన తర్వాత లెక్కలు చూసి మరొకరిని నియమించుకోవడమో, లేక పూర్తిగా తొలగించడమో చేయాలి. కానీ అలాగే వదిలివేయడంతో షాపునకు ప్రతి నెలా బాడుగ, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారమంతా వెలుగు–మండల సమాఖ్య భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నాయకులు వెలుగు అధికారులపై ఒత్తిడి పెంచి నెలల తరబడి మూత పడిన దుకాణాలు తెరవకుండ, కొత్తవారిని నియమించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరగడమేకాకుండా, పేదలు కూడా నష్టపోతున్నారు. జనరిక్ దుకాణాన్ని మూత వేస్తున్నాం:బేస్తవారిపేటలో అన్న జనరిక్ మెడికల్ దుకాణంలో రూ. 30 వేలు మెడిసిన్‌కు, రూ. 30 వేలు నిర్వాహణ నిధులు చూపించలేదు. వచ్చిన నగదు సకాలంలో సకాలంలో బ్యాంక్‌లో చెల్లించలేదు. ఇప్పటికే మండల సమాఖ్యకు రూ.2 లక్షలు నష్టం జరగడం, నూతన ఫార్మసిస్ట్ దొరకని కారణంగా అన్న జనరిక్ దుకాణానాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం.వెలుగు ఏపీఎం నాగశంకర్, బేస్తవారిపేట. -
ఆయుష్తీరింది
భీమవరం, తాడేపల్లిగూడెంలో మూతపడిన సంజీవని ఫార్మసీలు ఏలూరు (టూటౌన్) : పేద ప్రజలకు మందులు అందుబాటు ధరలో అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీ దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రితో పాటు తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిల్లో సంజీవని ఫార్మసీలను వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రులు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వీటిలో తాడేపల్లిగూడెం, భీమవరం ఫార్మసీలను మూసివేశారు. జంగారెడ్డిగూడెం, తణుకుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఒక్క ఏలూరులోని సంజీవని ఫార్మసీ ఒక్కటే సక్రమంగా సాగుతోంది. ఇక్కడ మాత్రమే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్పైర్ అయిన మందులు సరైన ప్రణాళిక లేకుండా జిల్లా సమాఖ్య లక్షల రూపాయలు వెచ్చించి ముందస్తుగా మందులు కొనుగోలు చేసింది. అయితే వాటి తేదీ ఎక్స్పైర్ అయిపోవడంతో వృథాగా మారాయి. భీమవరం, తాడేపల్లిగూడెం ఫార్మసీలు మూతపడడంతో వీటిని పడేశారు. ఏలూరులో రూ.2 లక్షలు విలువైన 108 రకాల మందులు ఎక్స్పైర్ కావడంతో వాటిని వెనక్కి పంపివేయడం జరిగింది. ఈ విషయం డీఆర్డీఏ అధికారులు జరిపిన విచారణలో బహిర్గతమైంది. జంగారెడ్డిగూడెం, తణుకు ఫార్మసీల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఏలూరులో సంవత్సరానికి రూ.12 లక్షల మేర అమ్మకాలు జరగడంతో కొద్దిస్థాయిలో లాభాలబాటలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 5 సంజీవని ఫార్మసీల్లో ఈ పరిస్థితులు ఉండగా జిల్లా అధికారులు మాత్రం ప్రతి మండల కేంద్రాల్లో ఫార్మసీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా సరైన నిర్వహణ, పూర్తిస్థాయిలో మందులు లేకపోతే అవి కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.