ఎవరది!
తాడేపల్లిగూడెం/భీమవరం క్రైం :అపరిచితులు.. వీళ్లు సిని మాల్లో హీరో మాదిరి వ్యక్తులు కాదు. ఎక్కడి నుంచి వస్తున్నారో.. ఎలా వస్తున్నారో తెలియదు. అకస్మాత్తుగా దాడులకు తెగబడటం.. ఇళ్లను దోచుకోవడం.. మహిళల మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకుపోవడం.. హత్యలకూ వెనుకాడకపోవడం వంటి ఘటనలు జిల్లాలో ఇటీవల పెచ్చుమీరుతున్నాయి. జిల్లాకు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న భీమవరం.. భౌగోళికంగా జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం, పారిశ్రామిక వాడగా వెలుగొందుతున్న తణుకు పట్టణాలతోపాటు జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోనూ అపరిచితులు చెలరేగిపోతున్నారు. జీవనోపాధి పేరిట వీరంతా ఇక్కడకు వస్తున్నారు. కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చి నివాసముంటున్నారు. వారంతా ఇక్కడివారితో కలిసిపోయి గౌరవంగా బతుకుతున్నారు. అయితే, అలాంటి వారి ముసుగులోనే ఇటీవల జిల్లాకు వస్తున్న కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
భీమవరం ఘటనతో ఉలిక్కిపడిన ‘పశ్చిమ’
ఈనెల 16న భీమవరం పట్టణంలో చోటుచేసుకున్న చెయిన్ స్నాచింగ్ ఘటన పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక మహిళ మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తులను స్థాని కులు, పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆ దొంగల్లో ఒక యువకుడు నాటు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అతడితోపాటు పరారైన మరో ఇద్దరు దొంగలను తొలుత బీహారీలుగా భావించారు. అరుుతే కొద్ది గంటల్లోనే ఇది కొత్త మలుపు తిరిగింది. తుపాకీతో కాల్పులు జరిపి పట్టుబడిన యువకుడిని రాజస్థాన్ వాసిగా గుర్తించినట్లు సమాచారం. పరారైన ఇద్దరు యువకులు కూడా రాజస్థానీయులేనని పోలీసులు గుర్తిం చినట్లు తెలుస్తోంది.
తాడేపల్లిగూడెంలో ఇలా
మూడు రోజుల క్రితం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో హిందీ మాట్లాడుతూ అనుమానాస్పదంగా తిరిగే ఓ వ్యక్తి అరధరాత్రి ఒంటి గంట సమయంలో కర్రతో మహిళపై దాడి చేశాడు. పెంటపాడు ప్రాంతానికి చెందిన ఒక మహిళ సింహా చలం వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు రాగా, ప్లాట్‌ఫామ్‌పై తారసపడిన అపరిచి తుడు హిందీలో ఏదో మాట్లాడాడు. టికెట్ కోసం అడుగుతున్నాడనుకుని సదరు మహిళ టికెట్ కౌంటర్‌కు వెళ్లే దారి చూపించగా, చేతిలో ఉన్న కర్రతో ఆ మహిళ దవడపై కొట్టడంతో ఆమెకు బలమైన గాయమైంది. బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటికే అపరిచిత వ్యక్తి ఉడాయిం చాడు. ఇదిలావుంటే.. ఇటీవల తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టపగలు కొన్నిచోట్ల , రాత్రివేళ కొన్నిచోట్ల దొంగలు చెలరేగిపోతున్నారు. వీటిలో భారీ చోరీలతోపాటు చిల్లర దొంగతనాలు సైతం ఉంటున్నాయి. పోలీసులు నిఘా పెంచినప్పటికీ చాలినంత సిబ్బంది లేకపోవడంతో చోరీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాడేపల్లిగూడెం రె ల్వే క్వార్టర్స్ సమీపంలోని ఓ అపార్టుమెం ట్‌లో పట్టపగలే చోరీ జరిగింది. పాతూరు కనకదుర్గ ఆలయంలోను, దానికి సమీపంలోని ఇంట్లోను ఇటీవల దొంగతనాలు జరిగాయి. ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రాంతంలో ఇదే తరహా ఘటన జరిగినట్టు చెబుతున్నారు.
తుపాకులు ఎలా వస్తున్నాయ్
జిల్లాలో ఇటీవల తుపాకులు హల్‌చల్ చేస్తున్నాయి. పలు కేసుల్లో నింది తులు తుపాకులు ఉపయోగిస్తుం డటం కలవరపరుస్తోంది. తుపాకులు వారి వద్దకు ఎలా వస్తున్నాయి.. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. బయట ప్రాంతాల నుంచి వచ్చి తుపాకులతో సంచరిస్తున్నా పోలీసు యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ శాఖలో నేరస్తులు, అనుమానితులు, పాత నేరస్తులపై నిత్యం నిఘా ఉంచేందుకు కొంతమంది సిబ్బందితో ప్రత్యేక పోలీసు విభాగాలు ఉన్నాయి. అయితే ఆయా విభాగాలు కొన్ని కార్యకలాపాలకే పరిమితం కావడం వల్ల నేరస్తులపై నిఘా కొరవడిందనే విమర్శలు కూడా ఉన్నాయి.