వసతుల కల్పనకు కృషి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు గాను వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ఆస్పత్రులకు అధికశాతం పేదవారే వస్తారని, వీరికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషిచేస్తానన్నారు. వైద్య రంగంలో ఎన్నో ఆధునికమైన పరికరాలు వచ్చాయని, వాటిని ఆస్పత్రికి తీసుకురావడానికి సంబంధితశాఖాధిపతులతో మాట్లాడతానని తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ‘ సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి నివేదించానని వివరించారు. ఆస్పత్రిలో కొత్త జనరేటర్, శిథిలమైన మార్చురీగది స్థానంలో కొత్త గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రి ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో ఇన్వర్టర్లు పనిచేయడంలేదని, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదుల్లో వసతులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆస్పత్రిలో వసతులు, పరిసరాలను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారి డాక్టర్.హనుమంతరావు, మహిళా సంఘాల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, శంకర్‌పల్లి ఎంపీపీ చిన్న నర్సింహులు, మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
29సిహెచ్‌వి 03ః చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య
29సిహెచ్‌వి 04ః ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాలె యాదయ్య