MLA kale yadaiah
-
చేవెళ్ల రైతు బజార్‌కు 50లక్షలు మంజూరు
ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: మండల కేంద్రంలో ఏర్పాటుచేయనున్న రైతుబజార్‌కు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేవెళ్లకు కూడా మంజూరుచేసిందని తెలిపారు. దీనికి రూ. 50లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఈ రైతుబజార్ పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు ఆయన చెప్పారు. రైతు బజార్ ఏర్పాటైతే దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవచ్చని తెలిపారు. దీంతో వినియోగదారులకు తాజాగా, తక్కువ ధరలకు కూరగాయలు లభించే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని గుండం (పుష్కరిణి) ఆధుణీకరణ, మరమ్మతులకోసం ప్రభుత్వం రూ. 35 లక్షలను మంజూరుచేసిందన్నారు. ఈపనులను కాంట్రాక్టరు వెంటనే పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుబజార్ ఆస్థలంలో వద్దు చేవెళ్లలో రైతుబజార్ నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత స్థలం అతిపురాతనమైన సుమారు 400 ఏళ్లక్రింద నిర్మితమైన శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయం పక్కన ఉందని, అక్కడ నిర్మిస్తే అపవిత్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. రైతుబజార్ ఇక్కడ కాకుండా మరోస్థలంలో నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్యకు పలు కాలనీలవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ స్థలంలో రైతుబజార్‌ను వ్యతిరేకిస్తూ దేవాదాయ ధర్మాదాయశాఖతో పాటుగా స్థానికంగా ఉన్న పలు కాలనీవాసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారని తెలిపారు. ఈ విషయంపై పునరాలోచించాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి శంకర్పల్లి: ‘ఆస్పత్రులకు వచ్చే రోగుల చికిత్సకోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చేస్తోంది. రోగులకు వైద్యం అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. నీవు విధులకు హాజరు కావు.. నీవు ఉండి ఎందుకు దండగ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ఆస్పత్రికి వచ్చాను.. విధుల్లో లేవు.. మరో రెండుసార్లు కూడా ఆస్పత్రికి వచ్చినా కనిపించలేదు. ఇలాగైతే ఈ ఆస్పత్రి ఎందుకు.. మీరు ఎందుకు..’ అని శంకర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నాగనిర్మలపై ఎమ్మెల్యే కాలె యాదయ్య తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నర్సింలు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమానంగా అమలు చేస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
వసతుల కల్పనకు కృషి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు గాను వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ఆస్పత్రులకు అధికశాతం పేదవారే వస్తారని, వీరికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషిచేస్తానన్నారు. వైద్య రంగంలో ఎన్నో ఆధునికమైన పరికరాలు వచ్చాయని, వాటిని ఆస్పత్రికి తీసుకురావడానికి సంబంధితశాఖాధిపతులతో మాట్లాడతానని తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ‘ సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి నివేదించానని వివరించారు. ఆస్పత్రిలో కొత్త జనరేటర్, శిథిలమైన మార్చురీగది స్థానంలో కొత్త గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో ఇన్వర్టర్లు పనిచేయడంలేదని, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదుల్లో వసతులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆస్పత్రిలో వసతులు, పరిసరాలను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారి డాక్టర్.హనుమంతరావు, మహిళా సంఘాల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సింహులు, మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 29సిహెచ్‌వి 03ః చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య 29సిహెచ్‌వి 04ః ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మొయినాబాద్: విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని భావిభారత పౌరులుగా ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సురాజ్య భారత్ స్టూడెంట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా పనిచేసి దేశ రాష్ట్రపతి అయి అనేక సేవలందించారని కొనియాడారు. భారత రాష్ట్రపతి అయికూడా సాధారణ జీవితం గడిపిన అసాధారణ వ్యక్తి కలాం అన్నారు. విద్యార్థులు అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశానికి సేవలందించే సైనికులుగా తయారు కావాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ప్రముఖ కవి డాక్టర్ జే.బాపిరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాంకు విద్యార్థులంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నా విద్యార్థులతోనే ఎక్కువగా మాట్లాడేవారన్నారు. కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు విజయ్ ఆర్య, కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కొమ్మిడి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గున్నాల రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌లు గీతావనజాక్షి, సుధాకర్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, మాణిక్‌రెడ్డి, మంగలి పెంటయ్య, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, నాయకులు ఈగ రవీందర్‌రెడ్డి, పద్మారావు, మాణెయ్య, హరినాథ్, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
‘హరితహారం’ విజయవంతం చేయండి నవాబుపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మూలమాడలో మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమే హరితహారం కార్యక్రమమన్నారు. మొక్కలు విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పోలీస్ రాంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ సుభాన్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ డెక్క మాణెయ్య, నాయకులు రాములు, మోహన్‌రెడ్డి, నరెందర్‌రెడ్డి పాల్గొన్నారు.