చేవెళ్ల రైతు బజార్‌కు 50లక్షలు మంజూరు
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: మండల కేంద్రంలో ఏర్పాటుచేయనున్న రైతుబజార్‌కు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేవెళ్లకు కూడా మంజూరుచేసిందని తెలిపారు. దీనికి రూ. 50లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఈ రైతుబజార్ పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు ఆయన చెప్పారు. రైతు బజార్ ఏర్పాటైతే దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవచ్చని తెలిపారు. దీంతో వినియోగదారులకు తాజాగా, తక్కువ ధరలకు కూరగాయలు లభించే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని గుండం (పుష్కరిణి) ఆధుణీకరణ, మరమ్మతులకోసం ప్రభుత్వం రూ. 35 లక్షలను మంజూరుచేసిందన్నారు. ఈపనులను కాంట్రాక్టరు వెంటనే పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతుబజార్ ఆస్థలంలో వద్దు
చేవెళ్లలో రైతుబజార్ నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత స్థలం అతిపురాతనమైన సుమారు 400 ఏళ్లక్రింద నిర్మితమైన శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయం పక్కన ఉందని, అక్కడ నిర్మిస్తే అపవిత్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. రైతుబజార్ ఇక్కడ కాకుండా మరోస్థలంలో నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్యకు పలు కాలనీలవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ స్థలంలో రైతుబజార్‌ను వ్యతిరేకిస్తూ దేవాదాయ ధర్మాదాయశాఖతో పాటుగా స్థానికంగా ఉన్న పలు కాలనీవాసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారని తెలిపారు. ఈ విషయంపై పునరాలోచించాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు.