సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే.
ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు.
ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన !
శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది.
ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది.
వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment