సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపిస్తున్నామన్నారు. ‘‘లక్షల మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. నిలబెట్టుకుంటున్నాం’’ అని రేవంత్ చెప్పారు.
‘‘రాజకీయం ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనమే ముఖ్యమని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనడం సంతోషకరం. ఆనాడు నిధులు ఉన్నా గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. విత్తనాలకు సబ్సిడీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంటకు గిట్టుబాటు ధర తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే’’ అని రేవంత్ పేర్కొన్నారు.
అనుమానాలను పటాపంచలు చేశాం: డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామన్నారు. మిగిలిన బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేయలేకపోయారని.. మాకు 7 లక్షల కోట్లతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ సాధ్యమా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నాం. రైతు భీమా, పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
అదే మా టార్గెట్: మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆగస్టు నెల నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. నేటితో లక్షన్నర రూపాయల రుణమాఫీ జరగబోతుందన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చిన ఆర్థిక శాఖ కు కృతజ్ఞతలు. ఆయిల్ ఫాం సాగును పెంచుతాం.. కనీసం 5 లక్షల ఎకరాలలో సాగు టార్గెట్ పెట్టుకున్నాం’ అని తుమ్మల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment