సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’.. | Telangana Govt Plans To Decrease Mother And Children Deaths | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపు చల్లగా.. 

Published Tue, Jul 2 2019 2:24 AM | Last Updated on Tue, Jul 2 2019 9:03 AM

Telangana Govt Plans To Decrease Mother And Children Deaths - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మాతా శిశు మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ప్రస్తుతం ప్రతి లక్ష ప్రసవాల్లో 81 మంది తల్లులు, ప్రతి వెయ్యి జననాల్లో 28 మంది శిశువులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రసవాల సందర్భంగా లేబర్‌ రూం (ప్రసవ గది)లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్‌ కేసులను ఎలా డీల్‌ చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను, ఏకరూప కార్యక్రమాన్ని తయారు చేసింది. దానికి అనుగుణంగా లేబర్‌ రూంలలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించేలా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం.

ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు లేబర్‌ రూంలలో ప్రసవాలు చేయకుండా అత్యంత సురక్షిత పద్ధతిలో కీలకాంశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల్లో ‘దక్షత’ను వైద్య ఆరోగ్యశాఖ పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు పది జిల్లాల్లో 2 వేల మంది డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారు కిందిస్థాయిలో మరికొందరికి ఇచ్చేలా కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మిగిలిన జిల్లాల్లోనూ ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం విశేషం. 

ఆ 72 గంటలే కీలకం... 
మాతాశిశు మరణాలు ప్రసవ సమయం నుంచి 72 గంటల మధ్య ఎక్కువగా సంభవిస్తుంటాయి. రక్తస్రావం జరగడం, బీపీలో హెచ్చుతగ్గులు, ఇన్‌ఫెక్షన్‌ సోకడం, శిశువు బయటకు రాకపోవడం తదితర కారణాల వల్ల గర్భిణులు చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే శిశువులైతే ఉమ్మనీరు మింగేయడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో చనిపోతుంటారు. గర్భిణులు ప్రసవం కోసం వచ్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగే వరకు మధ్యగల 72 గంటలే అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది తీసుకునే ప్రత్యేక జాగ్రత్తల మీదే మాతా శిశువుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో లేబర్‌రూంలు ఎంత గొప్పగా ఉన్నా హైరిస్క్‌ కేసుల్లో చేపట్టాల్సిన ప్రొటోకాల్‌ చికిత్సను పాటించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన చికిత్సా పద్ధతులు పాటించడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయని, అలాంటి వాటికి చెక్‌ పెట్టడమే దక్షత కార్యక్రమం ఉద్దేశమని డాక్టర్‌ వరప్రసాద్‌ తెలిపారు. చాలావరకు సంభవించే మరణాలన్నీ కూడా లేబర్‌ రూంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనని ఆయన విశ్లేషించారు. దక్షత ద్వారా శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రసవాల సందర్భంగా పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని పెంచుతారు. ప్రసవాల సందర్భంగా పాటించాల్సిన పద్ధతులను చెబుతారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను శిక్షణలో భాగంగా నేర్పిస్తారు.

సిజేరియన్ల తగ్గింపూ లక్ష్యమే... 
హైరిస్క్‌ సందర్భాల్లో అనేక మంది వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్ల వైపు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్‌ ద్వారానే జరిగినట్లు సర్కారు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్‌ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. దేశంలోకెల్లా తెలంగాణలో అత్యధికంగా సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా మాతాశిశు మరణాలను తగ్గించడం, సిజేరియన్లను వీలైనంత వరకు నివారించడమే లక్ష్యంగా దక్షత కార్యక్రమం ద్వారా ముందుకు సాగాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రసవాలను సురక్షితంగా ఎలా చేయాలి? హైరిస్క్‌ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాల గురించి వైద్యులు, సిబ్బందికి ప్రయోగాత్మకంగా చూపేందుకు ఉన్నతాధికారులు ఒక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఇదొకరకంగా మాక్‌ డ్రిల్‌ లాంటిది. ఆ పరికరం ధర లక్ష రూపాయలు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement