జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
కరీంనగర్‌హెల్త్: జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రసవం కూడా నిర్వహించలేదు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రోగుల తాకిడి తగ్గించి స్థానికంగా మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ఆరు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.
అందులో భాగంగానే నగరంలోని మూడు పాత అర్బన్ పీహెచ్‌సీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా అన్ని రకాల చికిత్స అందించేందుకు 10 పడకలతో సౌకర్యాలు కల్పించింది. అర్బన్ పీహెచ్‌సీ పరిధిలో నమోదైన గర్భిణులకు అక్కడే సాధారణ ప్రసవాలు జరిపించాలని లేబర్ రూంలను సైతం ఏర్పాటు చేసి సామగ్రి, సౌకర్యాలు కల్పించింది. అదేస్థాయిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని కూడా నియమించింది. అయినా ఇప్పటివరకు ఒక సాధారణ ప్రసవం కూడా జరగలేదు.
ఎంసీహెచ్‌సీపై ప్రభావం
పీహెచ్‌సీల మాదిరిగానే నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించకపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై విపరీతమైన ప్రభావం పడుతోంది. ఎక్కడి వారికి అక్కడే ప్రసవాలు జరిపించాలని, ప్రసవం ప్రమాదకరంగా మారిన గర్భిణులు, హైరిస్క్ కేసులను మాత్రమే ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. అయితే సాధారణ ప్రసవాలు కూడా జరుపకుండా ఎసీహెచ్‌సీకి రెఫర్ చేయడంతో వైద్యసేవలు అందించడం ఇబ్బందికరంగా మారుతోందని, రిస్కు కేసులపై దృష్టి సారించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీహెచ్‌సీల్లో పెరుగుతున్న కేసులు
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి వరకు 8554 ప్రసవాలు నిర్వహించారు. 2019 జనవరిలోనే 762 ప్రసవాలు జరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు చర్యలు చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటింటికీ సర్వేలు నిర్వహించి గర్భిణుల పేరు నమోదు చేసుకొని ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. గర్బం దాల్చి పేరు నమోదు అయినప్పటి నుంచి ప్రసూతి జరిపించి తల్లితోపాటు శిశువును కూడా ఆరోగ్యంగా ఇంటికి చేర్చుతున్నారు. ఇంటికి చేరిన శిశువుకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతినెలా వ్యాధి నిరోధక టీకాలు వేయడం వంటివి పకడ్బందీగా చేపడుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ వంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపయింది.
2018లో 9185 ప్రసవాలు
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 2018లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 9185 ప్రసవాలు నిర్వహించారు. 2016లో 3762 ప్రసవాలు నిర్వహించగా, 2017లో దాదాపు సంఖ్య రెట్టింపై 6945కు చేరింది. 2019 జనవరిలో 762 ప్రసవాలు నిర్వహించారు.
వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్లు, సిబ్బందికి వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందుతున్న వైద్యసేవలపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. గర్భిణుల పేరు నమోదు, వారికి అందుతున్న వైద్య సేవలపై దృష్టి సారిస్తోంది. పేరు నమోదు నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీవారం ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండే సమయానికి ముందుగానే పరీక్షలు చేసి సుఖప్రసవం కావడానికి చర్యలు చేపడుతుండంతో ప్రసవాలసంఖ్య రెట్టింపు అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment