‘బయో’పెట్టినా మాయే..
‘బయో’పెట్టినా మాయే..
Published Sun, Aug 28 2016 6:18 PM | Last Updated on Tue, Oct 9 2018 7:43 PM
* వైద్యశాలల్లో నామమాత్రంగా భయోమెట్రిక్ హాజరు
* కచ్చితమైన సమయానికి వచ్చి వేలిముద్ర
* తర్వాత ఉడాయింపు.. తిరిగి వచ్చి మళ్లీ ముద్ర
వైద్యరంగంలో మెరుగైన సేవలందించడం కోసం ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వెరసి సకాలంలో వైద్యసేవలు అందక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహించే వైద్యాధికార సిబ్బంది విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదన్న కారణంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు విధులకు హాజరయ్యే సమయం, విధులు ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మిషన్‌లో వేలి ముద్రల ద్వారా నమోదును పొందుపరచాల్సి ఉంటుంది. దీన్ని బట్టే వేతనాలు అందుతుంటాయి. కానీ స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ నమోదు వేసి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం విధులు ముగిసే సమయంలో వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారులు,సిబ్బంది విధినిర్వహణ సమయంలో బయట వెళ్లి ప్రైవేటుగా తమ కార్యకలాపాలను కొనసాగిçస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు రోగుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చ పేదలు ప్రభుత్వాసుపత్రిలో రాత్రి పూట సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రు పూట ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే అనేక అక్రమాలు బయట పడతాయాని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాత్రి సమయంలో వైద్యం అందని ద్రాక్షే..
డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి సమీపంలో హైవే మార్గాలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలతో పాటు రైల్వే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దీంతోపాటు డివిజన్‌లో పలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉండటం మూలంగా నిత్యం అనేక అల్లర్లు చోటు చేసుకుంటుంటాయి. ఆయా సంఘటనలలో గాయపడి అర్థరాత్రిళ్లు చికి త్స కోసం ఏరియా వైద్యశాలను ఆశ్రయిస్తే అక్కడ వైద్యులు ఉండరు. ఉన్న సిబ్బంది నామమాత్రపు సేవలు అందించడంతో మెరుగైన వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వ్యక్తిని 108లో ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది గుంటూరు వైద్యశాలకు క్షతగాత్రుణ్ణి తరలించారు. ఇటువంటి సంఘటనలు ఏరియా వైద్యశాలలో అనేకం జరుగుతున్నాయి.
విచారించి చర్యలు తీసుకుంటాం..
విధి నిర్వహణ సమయంలో వైద్యశాలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై సమగ్రంగా విచారించిన అనంతరం చర్యలకు సిఫారసు చేస్తాం.
టి. మోహన్ శేషుప్రసాద్, సూపరిండెంట్
Advertisement
Advertisement