శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి
వేలిముద్రలు.. ప్రపంచంలో ఏ ఇద్దరివీ సరిపోలవు.. కానీ ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ–కేవైసీ యంత్రంలో మీ వేలిముద్ర పడుతూ మీ పేరిట సిమ్‌కార్డులు జారీ అయిపోతుంటాయి. చదువును మధ్యలోనే ఆపేసిన సంతోష్‌కుమార్ అనే యువకుడు.. ఇంటర్నెట్ సాయంతో నకిలీ వేలిముద్రల తయారీని నేర్చుకుని, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని ఓ లోపాన్ని ఆసరాగా తీసుకుని వేలాది మందికి చెందిన నకిలీ వేలిముద్రలను తయారుచేశాడు. ఆ వేలిముద్రలను ఆధార్ డేటాబేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించి.. వేల సంఖ్యలో కొత్త సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. దీనిపై ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ సహా కేంద్ర నిఘా అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనివెనుక ఉగ్రవాదులు, మావోయిస్టుల కోణం ఉందేమోనని సందేహించారు.
కానీ లోతుగా పరిశీలించాక.. కేవలం సిమ్‌కార్డుల ‘టార్గెట్’పూర్తి చేసుకోవడానికి సంతోష్ ఈ పనిచేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. సంతోష్ అనుసరించిన విధానం ఏ ఉగ్రవాదుల చేతుల్లోనో, మావోయిస్టుల చేతుల్లోనో పడితే.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని ‘ఆధార్’కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు గత బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. తన వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా కోరిన ఢిల్లీలో పనిచేసే యూఐడీఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి పూర్తి వివరాలు వెల్లడించారు.
సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి కోసం..
పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌కుమార్ బీఎస్సీ చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్‌టైమ్‌తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్‌కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్. ఈ టార్గెట్ పూర్తికాకపోతే కమీషన్ చాలా తక్కువగా వస్తుంది. దాంతో సంతోష్ కొన్నాళ్ల పాటు కాలేజీలు, పాఠశాలల వద్ద స్టాల్ ఏర్పాటు చేసి.. తానే రూ.5 ఎదురిస్తూ సిమ్‌కార్డులు విక్రయించాడు. మొత్తంగా టార్గెట్ పూర్తి చేసి కమీషన్ పొందేవాడు.
ఉచితంగా రూ.50కిపైగా టాక్‌టైమ్ వస్తుండటంతో విద్యార్థులు తరచూ సిమ్‌కార్డులు తీసుకుంటుండేవారు. కానీ ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్‌కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర నమోదు తర్వాతే సిమ్ యాక్టివేషన్ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్ విక్రయాల టార్గెట్ పూర్తిగాక కమీషన్ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు.
వివరాలన్నీ ఒకే చోట దొరకడంతో..
ఎవరో ఒకరి పేరు మీద సిమ్‌కార్డులు యాక్టివేట్ చేయడం ద్వారా టార్గెట్ పూర్తి చేసుకోవాలని సంతోష్ భావించాడు. సాధారణంగా ఓ సిమ్‌కార్డు యాక్టివేట్ కావాలంటే.. వినియోగదారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ తనిఖీ పరికరంలో ఆ వ్యక్తి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయనే దానిపై అధ్యయనం చేసిన సంతోష్.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఈ మూడు వివరాలను డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారని గుర్తించాడు.
అంతేకాదు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ లో డాక్యుమెంట్ నంబర్, పలు వివరాలు నమోదు చేస్తే.. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల సిరీస్‌ను పరిశీలించాడు. వాటి తరహాలో కొన్ని నంబర్లను వెబ్‌సైట్లో నమోదు చేస్తూ వెళ్లగా.. ఓ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ అయింది. దాంతో ఆ సిరీస్‌లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు.
ఇంటర్నెట్‌లో ‘వేలిముద్రల’తయారీ నేర్చుకుని..
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల చివరి పేజీలో ఆ స్థిరాస్తిని విక్రయించిన, కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు ఉంటాయి. ఇలా పేపర్ మీద ఉన్న వేలిముద్రలను.. తిరిగి ఎక్కడైనా వేయగలిగేలా ఎలా తయారు చేయాలన్న దానిపై ఇంటర్నెట్‌లో వెతికాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. కాగితంపై ముద్రించి ఉన్న లోగోలు, డిజైన్లను స్టాంపుగా మార్చడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. లోగోనుగానీ, డిజైన్‌నుగానీ కాంతి కిరణాలతో స్కాన్ చేసే ఆ యంత్రం.. అదే లోగో/డిజైన్‌ను రబ్బరుపై ఏర్పరుస్తుంది. అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే యంత్రంలో లోగోను, డిజైన్‌ను పెట్టాల్సిన చోట.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రల కాగితాన్ని పెట్టాడు. దాంతో ఆ యంత్రం వేలిముద్రను స్కాన్ చేసి.. రబ్బరుపై అదే ఆకృతిని ఏర్పాటు చేసింది. అయితే సంతోష్ ఈ–కేవైసీ యంత్రంలో ముద్ర వేయడానికి వీలుగా రబ్బరుకు బదులుగా.. ప్రత్యేకమైన మెత్తటి ప్లాస్టిక్ పాలిమర్‌ను వినియోగించాడు. ఈ–కేవైసీ యంత్రంపై ఈ పాలిమర్ ముద్రను పెట్టినప్పుడు.. నేరుగా వేలిముద్ర వేసిన తరహాలో పనిచేసింది. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. తర్వాత ఆ సిమ్‌కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్ మాత్రం పూర్తయి, సిమ్ విక్రయాల కమీషన్ అందింది.
ఉలిక్కిపడిన యూఐడీఏఐ
సంతోష్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసి, నకిలీ వేలిముద్రలు తయారు చేసి.. సిమ్‌కార్డులను యాక్టివేట్ చేశాడు. ఇలా దాదాపు నెల రోజుల్లో ఆరు వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్ అప్రూవల్స్ పొందిన విషయాన్ని గుర్తించిన యూఐడీఏఐ విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్‌కార్డులు చేరుతున్నాయని సందేహించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌ను విచారించారు. సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్ చేసిన పని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్‌ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయ్యారు.
జాతీయ స్థాయిలో ‘అలర్ట్’!
వేలిముద్రల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానాన్ని భద్రమైన మార్గంగా పరిగణిస్తూ మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిని వినియోగిస్తున్నాయి. మన దేశంలోనైతే ‘ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)’కు కూడా వేలిముద్రనే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో సంతోష్ చెప్పిన వివరాలను విన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వేలిముద్రల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించడం వంటి ఆర్థిక నేరాల నుంచి ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడిని నేరాల్లో ఇరికించడం వంటి క్రిమినల్ నేరాలకూ దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
ఢిల్లీలో ప్రతి మూడు నెలలకోసారి ‘మల్టీ ఏజెన్సీస్ కమిటీ’పేరుతో పిలిచే మ్యాక్ సమావేశం జరుగుతుంది. అందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంతోష్ వ్యవహారం నేపథ్యంలో.. వారం రోజుల్లో మ్యాక్ సమావేశం ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అందులో ఈ కేసును చర్చించి.. దేశవ్యాప్తంగా ఇలాంటి లోపాలు గుర్తించాలని, ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని యూఐడీఏఐ కోరనుంది. ఆయా లోపాలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment