మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
ప్రమాదంతో వెలుగులోకి ఆవు కొవ్వు తరలింపు
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్ని ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో ధర్మారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.
ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25), అందులో ప్రయాణిస్తున్న అఫ్జల్(55) క్యాబిన్‌లో ఇరుక్కుని మరణించారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ట్రాలీలోని ఆవు కొవ్వు డబ్బాలు, చర్మం రోడ్డుపై పడిపోయాయి.
పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీశారు. అన్వర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, అఫ్జల్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు రమాదేవి, ఆగవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.
ఆవు కొవ్వు ఎందుకోసం?
బొలేరో ట్రాలీలో ఆవు కొవ్వు, చర్మం తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? రావాణాకు అనుమతి ఉందా? లేదా? ఆవు కొవ్వు, చర్మం దేనికి వినియోగిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుల బంధువులు వస్తే పూర్తిసమాచారం తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment