ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూడు నెలల నుంచి పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అరిగోస పడుతున్నారు. పింఛన్ కోసం ఎండలో కాళ్లకు బొబ్బలు పెట్టంగా.. వందలాది రూపాయలు రవాణా చార్జీలు భరిస్తూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు కనికరించడం లేదు. మా కష్టం పగవాడికి కూడా రావొద్దని పేర్కొంటున్నారు.
బయోమెట్రిక్ విధానం..
గతంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు పంపిణీ చేసేవారు. నెల మొదటి వారంలోనే ఆయా కార్యాలయాల వద్ద వారి పేర్లకు అనుగుణంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని పింఛన్ ఇచ్చేవారు. ఆ తర్వాత డీఆర్‌డీఏ నుంచి సీఎంఎస్‌వోలు కొన్ని రోజులపాటు పంపిణీ చేశారు. మృతిచెందినవారు, ఊరు వదిలి వెళ్లిపోయినవారు, పలువురు అనర్హులు పింఛన్‌లు పొందుతున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం యాక్సెస్ బ్యాంక్, ఫినో కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాలు, పోస్టల్ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, మణిపాల్ ఆధ్వర్యంలో బయోమెట్రి క్ విధానంలో పింఛన్ పంపిణీ విధానానికి తెర లేపారు.
కష్టాలు మొదలు..
బయోమెట్రిక్ విధానంతో పింఛన్‌దారుల కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా పలువురికి ఆధార్‌కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు ఉన్నా అనుసంధానం కాకపోవడం, బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలి ముద్రులు నమోదు కాకపోవడం కారణంగా బ్యాంక్ ఖాతాలు తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బ్యాంక్ కరస్పాండెంట్లు ప్రతినెల పింఛన్ వివరాలు ఎంపీడీవోకు అందజేయాలి. ఎంపీడీవోలు డీఆర్‌డీఏ కార్యాలయానికి సదరు వివరాలు పంపిస్తారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో పింఛన్లు అందుతున్నాయా లేదా అన్న వివరాలు కూడా తెలియలేదు. దీంతో నెలనెల పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. వృద్ధుల వేళ్లు అరిగిపోవడం, బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు చూపించకపోవడంతో వారి పింఛన్‌ను ఇవ్వడం లేదు.
గాడిలోపడని ఐరీస్
ఆధార్ ద్వారా సేకరించిన ఐరీష్ (కంటిపాపలు) విధానంలో నమోదు చేసుకొని పింఛన్ పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రక్రియ ఇంకా గాడిలో పడటం లేదు. పెలైట్ ప్రాజెక్టు కింద బోథ్, ఆదిలాబాద్, లక్ష్మణచాంద, నేరడిగొండ, కుంటాల, ఇచ్చోడ మండలాల్లోని పది గ్రామాల్లో ఐరీష్ విధానాన్ని చేపట్టారు. అక్కడ విజయవంతమైతే మిగతా మండలాల్లోనూ అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. మరోపక్క బ్యాంక్ కరస్పాండెంట్లకు ఇచ్చిన మిషన్లు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక పనిచేయకపోవడం, బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, కరస్పాండెంట్లకు ఈ ఆపరేటింగ్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సుమారు సగం మంది పింఛన్‌దారులకు పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది.
ఇచ్చేది అరకొరే..
జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. అందులో వృద్ధాప్య 1,35,750, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది ప్రతినెల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 500 పింఛన్ కింద అందజేస్తారు. ఈ లెక్కన ప్రతినెల రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో డీఆర్‌డీఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదట చేపట్టిన 34 మండలాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా 1,50,179 మందికి రూ.4.35 కోట్లు పింఛన్ నగదు అందజేస్తున్నారు.
అయితే మొదట చేపట్టిన ఈ ప్రక్రియలోనూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. 18 మండలాల్లో చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడ ం లేదు. నెలనెలా పింఛన్లు తీసుకోకపోతే మూడో నెల తర్వాత డబ్బులు వెనక్కి వెళ్లిపోతాయి. ఆ నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే వస్తుంది. పింఛన్‌దారులు తపాలా కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేసే పింఛన్ వస్తుంది. విధానం గాడిలో పడకపోవడంతో కష్టాలెప్పుడు దూరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయ్యా.. పింఛన్..!
Published Wed, May 28 2014 1:07 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
Advertisement
Advertisement