సాక్షి, మంచిర్యాల : సర్కారు నిర్ణయాలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పూటకో విధానం అమలు చేయడంతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. గతంలో స్మార్ట్‌కార్డుల ద్వారా పంపిణీ చేస్తామని, అనంతరం ఆధార్, రేషన్ కార్డుల ఎన్‌రోల్‌మెంట్ అంటూ తిప్పుకున్నారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో అక్రమాలను నిరోధించడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు.
ఈ విధానంతో చేతుల వేళ్లు లేనివారు.. వంకరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీరికోసం ప్రస్తుతం మళ్లీ ఐరీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కవిధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో పింఛన్‌కు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎండనకా.. వాననకా పింఛన్ కోసం బారులు తీరుతున్నారు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం అధికారుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా బాధలు తీరడం లేదు.. వీరి గోస ప్రభుత్వానికి తగలడం లేదు.
అక్రమాల పర్వం
జిల్లా వ్యాప్తంగా 2,75,639 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారు. 65 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వారితోపాటు అభయహస్తం కింద 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతినెలా రూ.200, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.500, వితంతువులకు రూ.500 చొప్పున డీఆర్‌డీఏ అందిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ రూపంలో అర్హులకు అందిస్తున్న ఆర్థికసహాయాన్ని చూసి కొందరు దళారులు, ఉద్యోగులు అనర్హులనూ జాబితాలో చేర్చి అక్రమంగా పింఛన్ పొందుతున్నారు.
పలుచోట్ల అర్హులకు అందించాల్సిన పింఛన్ కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనర్హులను గుర్తించడంతోపాటు వారి పెన్షన్లు రద్దు చేసేందుకు రెండు నెలల క్రితం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది. పింఛన్‌దారులు ప్రతినెల వారి చేతి బొటన వేలిముద్ర ఆ పరికరంపై పెడితే యంత్రం వారి వేలిముద్ర స్కాన్ చేసుకుంటుంది. వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వస్తాయి.
ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ వేలి ముద్రలు చెరిగిపోయి ప్రమాదాల్లో చేతులు పోయిన వారికి మాత్రం సమస్యలు మొదలయ్యాయి. వృద్ధులు పరికరంపై వేలిముద్ర పెడితే స్కాన్ కావడం లేదు. చేయిలేని వాళ్లు వేలిముద్రలు వంకర ఉన్న వాళ్లు తమ వేలి ముద్రలు స్కాన్ చేయించుకోలేని పరిస్థితి. దీంతో వీరికి పెన్షన్ నిలిచింది. ఇలాంటి వాళ్లు జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది వరకు ఉంటారని అంచనా.
తెరపైకి ‘ఐరీష్’
వేలిముద్రలు చెరిగిపోయిన వృద్ధులు, చేతివేళ్లు లేని వాళ్లకు రెండు నెలల నుంచి పింఛన్ అందక అవస్థ లు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఐరీష్ విధానంలో ఇవ్వాలని ఆలోచిస్తోం ది. ఐరీష్ ద్వారా కంటి స్కాన్ చేసి పెన్షన్ ఇస్తారు. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ఏదైన గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించా రు.
ఓ విధంగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ బాగానే ఉ న్నా ఐరీష్‌తోనూ వృద్ధులకు ఇబ్బందులు తప్పేట ట్లు లేవు. ఇప్పటికే ఆధార్ కార్డు దరఖాస్తు సమయంలో చాలామంది వృద్ధులకు కళ్లు స్కాన్ కాక ఇబ్బందులు తలెత్తాయి. కళ్లు కూడా స్కాన్ కాక పో తే ఎలా అని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బయోమెట్రిక్ పద్ధతిలో చేతి బొటన వేలు స్కాన్ కాని వారి కోసం ఐరీష్ విధానం అమలు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించి.. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పారు.
విల‘పింఛన్’
Published Fri, Feb 7 2014 2:10 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
Advertisement
Advertisement