మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?
బత్తలపల్లి : మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?..అంటూ పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు కోల్పోయినవారు, సీఎస్‌పీ స్వాహా చేయడంతో పింఛను అందని బాధితులు మండల కేంద్రంలో శుక్రవారం రాస్తారోరో చేశారు. కదిరి-అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు. టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వృద్దులు పట్ల ఆటవికంగా వ్యవహరిస్తున్న టీడీపీకి బుద్ధి చెబుతామంటూ నినాదాలు చేశారు. పలువరు వృద్ధులు మాట్లాడుతూ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, భూములున్నాయంటూ పింఛను ఎగురగొట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మంజూరైన పింఛను మొత్తాన్ని సీఎస్‌పీ స్వాహా చేశారని డీ చెర్లోపల్లికి చెందిన వృద్ధులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, జెడ్పీటీసీ అక్కిం నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు.
డి.చెర్లోపల్లిలో టీడీపీ నాయకుడు రామమూర్తినాయుడు సీఎస్‌పీ అవతారం ఎత్తి వృద్ధుల పింఛన్ ను స్వాహా చేశాడని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, పింఛన్‌దారులకు డబ్బు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్లను పునరుద్ధరించాలన్నారు. ఎస్‌ఐ శాంతీలాల్, ఎంపీడీఓ బండి నాగరాజు, ఈఓ పీఆర్డీ లక్ష్మీబాయి ఆందోళనకారులతో మాట్లాడారు. డి.చెర్లోపల్లిలో పింఛన్ సొమ్ము కాజేసినట్లు ప్రజావాణిలో పిర్యాదు చేశారన్నారు.
డీఆర్‌డీఏ అధికారులతో చర్చించి అక్విటెన్స్‌లు తెప్పించి విచారించగా సంతకాలు తమవి కాదని పింఛన్‌దారులు చెప్పినట్లు తెలిపారు. దీనిపై స్టేట్‌మెంట్ రికార్డు చేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపినట్లు సంబంధిత అధికారులు వివరిచారు. అనంతరం ధర్మవరం రూరల్ సీఐ విజయభాస్కర్‌గౌడు వచ్చి నేతలతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.
రాస్తారోకోతో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వైఎస్సార్ సీపీ నాయకులు, సర్పంచ్‌లు సంజీవు, సానే సూర్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు మాతంగి రామాంజనేయులు, వడ్డె క్రిష్టప్ప, ముష్ఠూరు నరసింహారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వెంకటరెడ్డి, జయరామిరెడ్డి, ఈడిగ కాశప్ప, మాల్యవంతం పరేష్, వేణు, మాజీ డీలర్ సూరీ, అనంతసాగరం క్రిష్ట, డి.చెర్లోపల్లి యల్లప్పనాయుడు, రామకృష్ణ, చల్లా క్రిష్టా, ముసలయ్య, నారాయణస్వామి, నరసింహులునాయుడు, నారప్పనాయుడు, పుల్లానాయుడు, రామానాయుడు, పురుషోత్తంచౌదరి, మనోహరరెడ్డి, ప్రభాకరరెడ్డి, శ్రీరాములు, చెన్నారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ డీలర్‌లు రామకృష్ణారెడ్డి, ఆదెప్ప, నాగభూషణ, బిల్లే సూరీ, శంకర్, బేల్దారి నరసింహులు పాల్గొన్నారు.