ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ రిమ్స్ : పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. పదేళ్లుగా తమకు పింఛన్ వస్తుందని.. ఇప్పుడేందుకు రాదని ప్రశ్నించారు. నెలనెల పింఛన్ తీసుకుంటున్న మాకు సర్వే తర్వాత మంజూరు కాకపోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో పాత విధానాన్నే కొనసాగించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని సుమారు 60 మంది బాధితులు ముట్టడిలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోనికి వెళ్లి ఆర్డీవో చాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి బయటకు వచ్చి బాధితుల గోడు విన్నారు.
బీజేపీ నాయకుడు సురేశ్‌జోషి మాట్లాడుతూ సర్వే పేరుతో పింఛన్లు తొలగించడం తో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వితంతువులకు పింఛన్‌కు మరణ ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, పదేళ్ల క్రితం వితంతు పింఛన్ మంజూరైన వారు ఇప్పుడా పత్రం ఎలా తీసుకొస్తారన్నారు. అక్కడికి వచ్చిన ఆర్డీవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, దీంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇంకా ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెలాఖరులోగా అర్హులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు. కలేక్టరేట్ నుంచి వెళ్లిన బాధితులు మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు. బీజేపీ నాయకులు కిషన్, ఆదినాథ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ రిమ్స్ : అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసరా పథకం పేరుతో అర్హులకు ప్రభుత్వం అ న్యాయం చేస్తోందన్నారు. అర్హుల పేర్లు సైతం జాబితాల్లోంచి తొలగించడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అరుణ్‌కుమార్, అరవింద్, కె.గణేశ్, మధుసుధన్, తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల కోసం కలెక్టరేట్ ముట్టడి
Published Fri, Nov 21 2014 2:54 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement