రాష్ట్రంలోని అన్ని ఎస్సీహాస్టళ్లలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అమలు చేయాలని అధికారులకు ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఎస్సీహాస్టళ్లలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం అమలుపై సహాయ సాంఘికసంక్షేమ అధికారుల సమావేశంలో ఎం.వి.రెడ్డి సమీక్షించారు.
సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో జరిగిన సమీక్షాసమావేశంలో బయోమెట్రిక్ అమలుచేసే క్రమంలో ఎదురవుతున్న నెట్‌వర్క్ సమస్యలు, ఇతరత్రా అంశాలను గురించి ఆయా జిల్లాల అధికారులు ప్రస్తావించారు. ఈ విధానానికి ల్యాండ్‌లైన్ ఫోన్‌కు అనుసంధానంచేయాలని కొందరు సూచించారు. మూడో తరగతి చదువుతున్న చిన్న పిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదని, ఇట్లాంటి సమస్యలున్న చోట ప్రత్యామ్నాయంగా అటెండెన్స్ నమోదుకు అనుమతినివ్వాలని కోరారు.
ఆయా సమస్యలను అధిగమించి వీలైనంత తొందరలో అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకుచర్యలు తీసుకోవాలని ఎం.వి.రెడ్డి ఆదేశించారు. అదే విధంగా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఎస్సీ హాస్టళ్లలోని విదార్థులు 93.15 శాతం ఉత్తీర్ణతను సాధించడం పట్ల హాస్టల్ సంక్షేమ అధికారులు, సహాయ,జిల్లా సాంఘికసంక్షేమ అధికారులను ఎం.వి.రెడ్డి అభినందించారు. చక్కని ఫలితాలు అందిస్తున్న దృష్ట్యా మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే తమ పిల్లలను తల్లితండ్రులు తమకు దగ్గరలోని ఎస్సీ హాస్టళ్లలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.