జరిమానా కడతారా.. కోర్టుకొస్తారా..? | police hulchul in anantapur at gummaghata | Sakshi
Sakshi News home page

జరిమానా కడతారా.. కోర్టుకొస్తారా..?

Published Tue, Aug 22 2017 1:25 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

జరిమానా కడతారా.. కోర్టుకొస్తారా..? - Sakshi

జరిమానా కడతారా.. కోర్టుకొస్తారా..?

► ట్రాన్స్‌కో  హుకుంతో దళితులు గజగజ
► పండుగపూట పరువు తీయడమేంటని ఆవేదన
► అప్పు చేసి అపరాధ రుసుం చెల్లించిన వైనం 
 
అనంతపురం: గుమ్మఘట్ట మండలం పూలకుంట ఎస్సీ కానీలో సోమవారం రాత్రి ముగ్గురు పోలీసులు హల్‌చల్‌ చేశారు. కాలనీకి చెందిన అంజినేయులు, రామాంజినేయులు, తిప్పక్క, దురుగప్ప, హనుమంతప్ప, తిప్పేస్వామి, శివణ్ణ, రాజణ్ణ తో పాటు మరో నలుగురిపై విద్యుత్‌ చౌర్యం కేసులు నమోదయ్యాయని, ఒకొక్కరు రూ. 500 చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేకుంటే కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో కాలనీలో కాసేపు గందర గోళం నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఉన్నపళంగా వస్తే తాము ఎక్కడి నుంచి తెచ్చికట్టాలని, ఒక రోజు గడువు ఇవ్వాలని ప్రాధేయ పడినా పోలీసులు ససేమిరా అన్నారు.  

దీంతో వారు పడరాని పాట్లు పడ్డారు. గ్రామంలో మారెమ్మ పండుగ జరుపుకుంటుండడంతో ఇళ్లనిండా బంధువులు వచ్చిన సమయంలో ఇలా పరువు తీయడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో 200 ఇళ్లు ఉన్నా తమపైనే ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. పొట్ట కూటికోసం వలసలు వెళ్లి కొద్దొగొప్పో సంపాదించుకుని వచ్చిన తమపై ప్రభుత్వం ప్రతాపం చూపడం మంచిది కాదంటూ శాపనార్థాలు పెట్టారు. కోర్టు పేరు చెప్పగానే భయపడి ఇతరుల వద్ద అప్పుచేసి అపరాధ రుసుం చెల్లించారు. కొందరైతే పండుగ లేకున్నా ఫర్వాలేదని డబ్బు కట్టేశారు. ఈ విషయమై సంబంధిత హెడ్‌కానిస్టేబుల్‌ చలమయ్య, పోలీసులు ఓబుళపతి, మురళిలను ‘సాక్షి’ వివరణ కోరగా తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వసూళ్లకు వచ్చామని, స్థానిక ఏఈ వీరిపై విద్యుత్‌ చౌర్యం కేసులు నమోదు చేశారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement