విన్నపాలు వినవలే..!
అనంతపురం రూరల్ : నా పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన 2.68 ఎకారాల భూమిని మరో వ్యకి దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడు.. ఇదేమిటని ప్రశ్రిస్తే దాడి చేయడానికి వస్తున్నాడని కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన సాకే శివానంద బుధవారం ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సులో ఇన్‌చార్జీ కలెక్టర్ రమామణికి వినతి పత్రం అందజేశాడు. బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సు సెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్, డీఆర్‌ఓ మల్లేశ్వరిదేవి పాల్గొన్నారు. ప్రజల నుంచి 206 అర్జీలను స్వీకరించారు.
– ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయాలని దళిత సంఘాల నాయకులు చిన్న పెద్దన్న, రవికుమార్‌లు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతులు లేని ఎస్సీ కాలనీలు అనేకం ఉన్నాయన్నారు.
– 6వ విడత భూ పంపిణీలో ప్రభుత్వం భూమిని మంజూరు చేసింది. అయితే రెవెన్యూ అధికారులు 1బీ, అండంగళ్‌లోకి నమోదు చేయడం లేదని పెనుకొండ మండలానికి చెందిన కళావతి వినతి పత్రం అందజేశారు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
– తనకల్లు మండలం రాగినేపల్లిలో ఫ్లోరైడ్ నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. తాగేందుకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గ్రీవెన్సులో అర్జీని అందజేశారు.
– కుందిర్పి మండల కేంద్రంలో దళితులకు సర్వేనెం 286–3లోని 4.23ఎకరాల విస్తీర్ణంలో 143 మందికి ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఆర్డీటీ సంస్థ సైతం ఇళ్లను నిర్మించింది. కాలనీలో కనీస వసతులైన వీధిలైట్లు , తాగునీరు, డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సులో వినతి పత్రం అందజేశారు.