బాహాబాహీ | sc colony and chairperson family fight in guntakal | Sakshi
Sakshi News home page

బాహాబాహీ

Published Sat, Apr 1 2017 11:46 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

బాహాబాహీ - Sakshi

బాహాబాహీ

- చైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యులు, ఎస్సీకాలనీవాసుల మధ్య ఘర్షణ
- ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్పగాయాలు
- పోలీసుస్టేషన్, మునిపల్‌ కార్యాలయాల ముట్టడి  


గుత్తి : గుత్తి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తులశమ్మ వర్గీయులు, ఎస్సీ కాలనీవాసుల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల వారు పోలీసుల ఎదుటే పరస్పరం చెప్పులతో కొట్టుకున్నారు. అలాగే ఎస్సీ కాలనీవాసులు పోలీసుస్టేషన్, మునిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం క్రితం తనను ముగ్గురు ఎస్సీ యువకులు డబ్బు కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని చైర్‌పర్సన్‌ కుమారుడు దిల్కా శీనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐదు రోజుల క్రితం రాణాప్రతాప్, మల్లి, మురళీని స్టేషన్‌కు పిలిపించారు. ఇది తెలిసి ఎస్సీ కాలనీవాసులు సుమారు వంద మంది స్టేషన్‌కు వెళ్లారు. దిల్కా శీనా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.1.20 కోట్లను కాజేసిన విషయాన్ని తాము బయట పెట్టామని, దీంతో కక్ష కట్టి తమ పిల్లలపై కేసు పెట్టాడని వారు ఆరోపించారు.

దీంతో సీఐ మ«ధుసూదన్‌ గౌడ్, ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు ఇరువర్గాలపై ఎలాంటి కేసులూ ఉండవని చెప్పి పంపారు. అయితే శనివారం ఆ ముగ్గురు యువకులను మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఎస్సీలు స్టేషన్‌ను ముట్టడించారు. తమ పిల్లలు ఏ తప్పూ చేయలేదని, వారిని వదిలి పెట్టాలని ఎస్‌ఐ రామాంజనేయులును కోరారు. సీఐ వచ్చాక ఏ విషయమూ చెబుతామని ఆయన సమాధానమివ్వగా వారు వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ వాహనానికి అడ్డు పడ్డారు. దీంతో ఎస్‌ఐ చేసేదేంలేక కిందకు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అయినా ఆందోళన కారులు అక్కడే బైఠాయించగా ఎస్‌ఐ తిరిగి స్టేషన్‌కు వచ్చి అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులనూ వదిలిపెట్టారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అయితే కాలనీకి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చైర్‌పర్సన్‌ తులశమ్మ కోడళ్లు, కుమార్తెలు ఎస్సీ కాలనీవాసులతో ఘర్షణకు దిగారు. పరస్పరం చెప్పులతో కొట్టుకున్నారు.

ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తమపై చైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు దాడి చేసి గాయపరిచారని ఎస్సీ కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తులశమ్మ వర్గీయులు, కుటుంబ సభ్యులు కూడా ప్రతిగా ఫిర్యాదు అందజేశారు. తిరిగి స్టేషన్‌లో కూడా ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు హెచ్చరించినా లెక్కచేయలేదు. కాలనీవాసులు స్టేషన్‌ గేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. చైర్‌పర్సన్‌ కుమారుడినిస్టేషన్‌కు పిలిపించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. ఈ తతంగం సుమారు మూడు గంటల పాటు జరిగింది. విచారణ చేసి దోషులందరిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

నా కొడుకును బ్లాక్‌ మెయిల్‌ చేశారు
తన కుమారుడు దిల్కా శీనాను బ్లాక్‌మెయిల్‌ చేశారని  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తులశమ్మ ఆరోపించారు. పోలీసు స్టేషన్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ముగ్గురు యువకులు గత  నెల రోజులుగా డబ్బు కోసం బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో పాటు వేధించారన్నారు. వేధింపులకు, బ్లాక్‌ మెయిల్‌కు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మిది కూడా తప్పన్నట్లు వారు ప్రవర్తించడం మంచిది కాదన్నారు.

నన్ను చైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యులు చితకబాదారు
ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులపై ఆర్టీఏ యాక్ట్‌ కింద వివరాలు అడగడానికి మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లిన తనను చైర్‌ పర్సన్‌ కుటుంబ సభ్యులు చితకబాదారని రాణాప్రతాప్‌ అనే యువకుడు ఆరోపించారు. కుడి చెయ్యి విరిగిందన్నారు. తనపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement