నిఘా..
వసతి గృహాల్లో బయోమెట్రిక్.. సీసీ కెమెరాలు..
ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో అక్రమాల తంతుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపుతూ అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలకు ఇక బ్రేక్ పడనుంది. ప్రభుత్వ తాజా ని ర్ణయంతో ఇకపై వార్డెన్లు చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళ్ల డం కూడా కుదరదు. నిత్యం స్థానికంగానే ఉంటూ హా స్టళ్లను పర్యవేక్షించక తప్పదు.
ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వసతిగృహంలో విద్యార్థుల హాజరు శా తాన్ని నమోదు చేయడానికి బయోమెట్రిక్ యంత్రాలు, వార్డెన్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న మెనూ పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ గత మంగళవారం సర్క్యులర్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో మన దగ్గరా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది.
పారదర్శకతకు పెద్దపీట..
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ అధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 39,924 వరకు గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వసతి గృహాల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తేవడానికి.. వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విద్యార్థి పేరు మొదలుకుని.. వసతి గృహంలో ఉన్న మౌలిక వసతుల వరకు సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు కానుంది. దీనిద్వారా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, వార్డెన్ల పనితీరు, విద్యార్థులపై పర్యవేక్షణ తదితర వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ పలువురు వార్డెన్లు నిధులు దండుకుంటున్నారనేది ప్రభుత్వం గుర్తించింది.
అమల్లోకి బయోమెట్రిక్ విధానం..
వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఉదయం, సాయంత్రం నమోదు చేస్తారు. దీనికితోడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల హాజరు, వారికి అందుతున్న మెనూ నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులకు పోషకాహారం అందనుంది. తద్వారా విద్యార్థుల హాజరు శాతం, మెనూ పరిశీలన ఆధారంగా నిధుల విడుదల ఉంటుంది. వసతి గృహాల్లో విధులు నిర్వహించే వార్డెన్లలో చాలా మంది నాలుగు రోజులకు, వారానికోసారి చుట్టపు చూపుగా హాస్టళ్లకు వచ్చి వెళ్తున్నారనేది ఆరోపణ. అంతేగాకుండా సిబ్బంది సమయానికి వెళ్లడం లేదనేది బహిరంగ రహస్యం. ఫలితంగా హాస్టళ్లలో విద్యార్థులు తింటున్నారా..? లేదా..? రోజుకు ఎన్ని పూటలు తిండి పెడుతున్నారు..? తిండి నాణ్యతగా ఉంటుందా..? వీటిపై అధికారులకు స్పష్టత లేదు. ఈ విధానానికి స్వస్తి పాలకాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.