సర్కారు ఆస్పత్రుల్లో... ప్రాణాలు హరీ! | Up to 108 people per day are dying in the government medical collages | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 28 2017 3:40 AM | Last Updated on Thu, Sep 28 2017 3:40 AM

Up to 108 people per day are dying in the government medical collages

సాక్షి, అమరావతి: ప్రభుత్వ బోధనాసుపత్రులకు వచ్చే రోగుల్లో అత్యధికులు అత్యవసర వైద్యం కోసం వచ్చేవారే. వీరిలో చాలా మందికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత ఉండదు. ఇలాంటి వారికి సకాలంలో సరైన వైద్యం ఎంత వరకు అందిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అర్ధరాత్రో, అపరాత్రో ఏ ప్రమాదమో జరిగి రక్తమోడుతూ వచ్చిన బాధితులను సైతం ప్రభుత్వాసుపత్రుల్లో పట్టించుకునే దిక్కు లేదు. పెద్దాసుపత్రుల్లో చేరిన వారిలో ఒక్కో ఆసుపత్రిలో రోజూ పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడుతున్నారంటే తప్పు ముమ్మాటికీ ప్రభుత్వానిదే. ఆయా ఆసుపత్రుల్లోని అత్యవసర వార్డుల్లో రోగుల సంఖ్యకు తగినన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు.. ఇతర పరికరాలు సమకూర్చాలి. ముఖ్యంగా నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి.

ఆపరేషన్‌ థియేటర్ల సంఖ్యను పెంచాలి. సర్కారు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రధానంగా వెంటిలేటర్‌ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. ఒక్కో వెంటిలేటర్‌కు 30 మంది రోగులు రోజూ వేచి చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అక్యూట్‌ మెడికల్‌ కేర్, రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్, న్యూరో ఇన్సెంటివ్‌ కేర్, కార్డియో థొరాసిక్‌ రికవరీ కేర్, పోస్ట్‌ ఆపరేటివ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన వెంటిలేటర్‌ చికిత్స బోధనాసుపత్రుల్లో బ్రహ్మ పదార్థమైంది. రోగుల రద్దీని తట్టుకోలేక కొన్ని ఆస్పత్రులు రోగి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా సరే డిస్‌చార్జి చేసి మరో రోగికి వెంటిలేటర్‌ అమర్చుతున్న దుస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం సకాలంలో జరిగితే మొత్తం ఇన్‌ పేషెంట్లలో 4 శాతానికి మించి మృతులు ఉండకూడదు. కానీ ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో ఆ సంఖ్య 10 శాతానికి మించి పోయింది. రోజుకు సగటున బోధనాసుపత్రుల్లోనే 108 మందికి పైగా మృతి చెందుతున్నట్టు వైద్య విద్యా శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి దాదాపు 39 వేల మంది వరకు మృతి చెందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

రోగులు పెరుగుతున్నా.. సౌకర్యాలు అంతంతే
రాష్ట్రంలో జనాభా పెరిగే కొద్దీ అందుకు అనుగుణంగా రోగుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడేళ్లలో సుమారు 22 శాతం మంది రోగులు పెరిగినట్టు అంచనా. కానీ వెంటిలేటర్ల సంఖ్య మాత్రం పెరగలేదు. ఉన్న వెంటిలేటర్లలో కూడా 40 శాతం పని చేయడం లేదు. శ్వాస తీసుకోలేని సమయంలో కృత్రిమ శ్వాసను అమర్చాల్సి వచ్చే రోగులకు నాలుగు గంటలు కూడా వెంటిలేటర్‌ దక్కని పరిస్థితి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకూ వెంటిలేటర్‌ దక్కడం లేదు. బోధనాసుపత్రుల్లో 14 వేల వరకు పడకలుంటే రోజూ 20 వేల మందికి పైగా పడకల కోసం వస్తున్నట్టు అంచనా. దీంతో అత్యవసర వైద్యం కోసం వస్తున్న వారికి వైద్యం దక్కక పోగా, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ఘటనలు కోకొల్లలు.

కొన్ని ఆస్పత్రుల్లో రోగులను తీసుకెళ్లేందుకు వీల్‌చైర్లు, స్ట్రెచర్‌లు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. బోధనాసుపత్రుల్లో ఏటా దాదాపు 39 వేల మంది మృతి చెందుతుంటే వాటికంటే స్థాయి తక్కువైన వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీటిల్లో ఏటా 15 వేల మృతులు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో కనీస స్థాయిలో కూడా వైద్యులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సామాన్యుడే సమిధ 
ఒకప్పుడు సామాన్యుడి పాలిట సంజీవనిలా నిలిచిన ఆరోగ్యశ్రీ కార్డుకు టీడీపీ ప్రభుత్వం వచ్చాక విలువ లేకుండా పోయింది. తమ రాష్ట్ర వాసులకు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్‌ వైద్య సేవ) కింద హైదరాబాద్‌లో వైద్యమందించొద్దని రాష్ట్ర సర్కార్‌ ఇటీవల ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సకల వసతులు ఉండే కార్పొరేట్‌ ఆస్పత్రులు, పేరొందిన వైద్య నిపుణులున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉచితంగా సర్జరీలు చేయించుకునే అవకాశాన్ని సామాన్యుడు కోల్పోయాడు. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ అందకుండా చేయడంతో ఏపీ ప్రజలంతా రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది. అయితే అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు కూడా రాష్ట్రంలో తగినన్న లేవు. పోనీ ప్రభుత్వాసుపత్రికే పోదామంటే అక్కడ మౌలిక వసతుల పరిస్థితి మరీ ఘోరం. సిరంజి ఉంటే సూది ఉండదు, నర్సు ఉంటే డాక్టర్‌ ఉండరు, వీరుంటే పడకలుండవు, అవి ఉన్నా వెంటిలేటర్లుండవు!! ఇక 108, 104 లాంటి వాహనాలు డీజిల్‌కు డబ్బుల్లేక, సిబ్బంది జీతాలివ్వక మూలన పడుతున్నాయి.

మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలు
- మౌలిక వసతుల లేమి. వెంటిలేటర్ల కొరతతో 30 శాతం మందికి సకాలంలో ఆక్సిజన్‌ అందడం లేదు
రోగుల సంఖ్యకు – పడకలు, ఆపరేషన్‌ థియేటర్లకూ పొంతన లేదు.. తగినన్ని ఐసీయూలు లేకపోవడం
అనంతపురం పెద్దాసుపత్రిలో ఇప్పటికీ అనస్థీషియా వర్క్‌స్టేషన్లు, బేబీ ఇంక్యుబేటర్లు లేని దుస్థితి
90 శాతం పెద్దాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరు
గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం వంటి పెద్దాసుపత్రుల్లోనే చిన్నారుల వైద్యానికి తగిన పరికరాలు లేవు
ఇప్పటికీ అత్యాధునిక ల్యాప్రొస్కోపిక్‌ పరికరాలు అందుబాటులో లేవు
మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్‌ వంటి జబ్బులకు స్పెషలిస్టు డాక్టర్లు లేరు
ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల్లో కోట్ల రూపాయలున్నా మౌలిక వసతులు కల్పించడం లేదు
అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం

ఆస్పత్రుల వివరాలు 
1157 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
192 సామాజిక 
ఆరోగ్య కేంద్రాలు
32 ఏరియా ఆస్పత్రులు
8 జిల్లా ఆస్పత్రులు
11 బోధన ఆసుపత్రులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement