సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 60 ఏళ్లు దాటిన వైద్యులకు శాపంగా మారింది. తమకు అనుకూలుడైన ఒక్కరి కోసం టీడీపీ సర్కార్ చేసిన తప్పుతో ఇప్పుడు 180 మంది వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక సచివాలయం, ఆర్థిక శాఖల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అన్నీ ఆలోచించి చేయాల్సిన ప్రభుత్వమే అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా చేసి, ఉద్యోగులకు తీవ్ర వేదన మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుకూలుడైన వ్యక్తి కోసం జీవో ఇచ్చి..
2017, మేలో అప్పటి టీడీపీ ప్రభుత్వం వైద్యుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 63 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. గుంటూరు పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డా.రాజునాయుడు రిటైర్ అవుతున్నారని, ఆయనను తిరిగి ఎలాగైనా పదవిలో కూర్చోబెట్టాలని ఓ ఫార్మా ఇండస్ట్రీ అధినేత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో హుటాహుటిన జీవో ఇచ్చేసింది. వాస్తవానికి పదవీ విరమణ వయసును పెంచాలంటే ఆర్డినెన్స్ లేదా శాసనసభలో బిల్లు ఆమోదించడం తప్పనిసరి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇదే పని చేసింది. కానీ టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేసింది. దీనివల్ల అప్పట్లో సుమారు 180 మంది వైద్యులు పదవీ విరమణ వయసు పెంపు పరిధిలోకి వచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇది జరగడంతో వేతనాల చెల్లింపు విషయంలో ట్రెజరీలో సమస్యలు తలెత్తాయి. దీంతో గత కొన్ని నెలలుగా 60 ఏళ్లు దాటిన వైద్యులకు జీతాలు ఆగిపోయాయి. అలోపతి వైద్యులతోపాటు ఆయుష్ వైద్యులు, రాష్ట్రపతి అవార్డు పొందిన టీచర్లు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. అసలు పదవీ విరమణ వయసును పెంచాలని ఎవరు అడిగారని వైద్యులు నిలదీస్తున్నారు. తమకు కావాల్సిన ఒక వ్యక్తి కోసం గత ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని, అందరికీ సమస్యలు తెచ్చిపెట్టిందని వేతనాలు రాని వైద్యులు, అవార్డీ టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలల నుంచి ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నామని, ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం శూన్యమని చెబుతున్నారు.
ఒక్కరి కోసం అందరికీ చిక్కులు
పదవీ విరమణ వయసును పెంచాలంటే యాక్ట్ 4 – 2014ను సవరించాల్సి ఉంది. ఈ సవరణ పూర్తయ్యాక శాసనసభలో బిల్లు పాస్ చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ గత ప్రభుత్వం ఇలా చేయకుండా తమకు అనుకూలుడైన ఓ వ్యక్తి రిటైర్ అవుతున్నారని, ఆయన కోసం పదవీ విరమణ వయసును పెంచింది. ఇప్పుడు అది అందరినీ చిక్కుల్లో పడేసింది. వేతనాలు రానివారు ఆర్థిక శాఖ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
–డా.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment