సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేసిన టీడీపీ సర్కారు ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఘోరంగా విఫలమైంది. ఫలితంగా ప్రాజెక్టులపై రూ.వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఎటువంటి ప్రతిఫలం రాకపోగా వ్యయం తడిసిమోపెడైంది. గత ఐదేళ్లలో వేల సంఖ్యలో చేపట్టిన పనుల అంచనాల విలువ ఇంతితై వటుండింతై అనే తరహాలో భారీగా పెరిగిపోయాయి. అన్ని శాఖలు, రంగాల్లో కలిపి చేపట్టిన పనుల విలువ సవరించిన అంచనాలతో ఏకంగా రూ.1,86,040.79 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ గణాంకాల్లో తేలింది. అన్ని శాఖల్లో తొలుత పరిపాలన అనుమతి ఏ మేరకు ఇస్తూ జీవోలు జారీ చేశారు? తరువాత సవరించిన అంచనాలను ఎంతకు పెంచారు? ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఎన్ని పనులకు ఎంత వ్యయం చేశారు? ఇంకా ఎంత వ్యయం చేయాల్సి ఉంటుంది? అనే వివరాలను ఆర్థికశాఖ అన్ని శాఖల నుంచి సేకరించింది. పనులు మంజూరు చేసినప్పటికీ ఇంకా ప్రారంభించని వాటి వివరాలను కూడా సేకరించింది.
అసలు లెక్కలపై దాగుడుమూతలు
ఆర్థిక శాఖ సేకరించిన సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి సవరించిన పనుల అంచనాల విలువ రూ.1,86,040.79 కోట్లుగా తేలింది. ఇందులో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.69,973.13 కోట్ల వ్యయం చేశారు. ఇంకా రూ.1,21,067.66 కోట్లు ఆ పనులపై వ్యయం చేయాల్సి ఉందని తేలింది. అయితే ఆర్థిక శాఖ కోరినప్పటికీ అసలు పరిపాలన అనుమతి ఎంతకు ఇచ్చారనే వివరాలను వివిధ శాఖలు వెల్లడించకపోవడం గమనార్హం. అంచనా విలువ తెలిస్తే సవరించిన తరువాత ఆయా పనుల అంచనాలు ఎంత మేరకు పెరిగాయనేది తేలుతుంది. కానీ శాఖలన్నీ తొలి అంచనా విలువను చెప్పకుండా కేవలం సవరించిన అంచనాల విలువ సమాచారాన్ని మాత్రమే పేర్కొన్నాయి.
అంచనాలకు రెక్కలు..
జలవనరుల శాఖలో సవరించిన అంచనాల మేరకు అత్యధికంగా రూ.1,35,040.70 కోట్లతో పనులు చేపట్టగా మార్చి నెలాఖరు నాటికి రూ.56,167.62 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.78,873.08 కోట్ల వ్యయం చేయాల్సి ఉందని జలవనరుల శాఖ పేర్కొంది. ఆ తరువాత మున్సిపల్, సీఆర్‌డీఏ కలిపి సవరించిన అంచనాల మేరకు రూ.34,569.67 కోట్ల విలువైన పనులను చేపట్టగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.4,382.27 కోట్ల వ్యయం చేశారు. ఇంకా రూ.30,187.40 కోట్ల వ్యయం చేయాల్సి ఉందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఒక్క సీఆర్‌డీఏలోనే రూ.24,068.91 కోట్ల సవరించిన అంచనాలతో 35 పనులను చేపట్టగా రూ.1,766.50 కోట్ల వ్యయం జరిగింది. ఇంకా రూ.22,302.41 కోట్ల వ్యయం చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే ఎఫ్‌ఆర్‌బీఎం ఉల్లంఘన..
కనీసం వనరులు ఉన్నాయా లేదా? అనే విషయాన్ని కూడా అధ్యయనం చేయకుండానే గత సర్కారు పలు పనులను చేపట్టింది. సాగునీటి రంగంలో అయితే నీటి లభ్యత, సవివరమైన ప్రాజెక్టు నివేదికలు లేకుండానే పరిపాలన అనుమతులు ఇచ్చేసి తరువాత అంచనాలను భారీగా పెంచేసింది. ప్రాజెక్టులు నిర్మించి పనులు చేసే ఉద్దేశంతో కాకుండా కేవలం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించి కమీషన్లు కాజేయటమే లక్ష్యంగా వీటిని చేపట్టినట్లు అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. టీడీపీ సర్కారు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది.
ఇంతింతై.. రూ.1.86 లక్షల కోట్లై!
Published Sat, Jun 1 2019 4:20 AM | Last Updated on Sat, Jun 1 2019 4:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment