కొత్త బిల్లులు కట్‌! | Pending bills Is Above Rs 14888 crores in various departments | Sakshi
Sakshi News home page

కొత్త బిల్లులు కట్‌!

Published Sun, May 5 2019 3:38 AM | Last Updated on Sun, May 5 2019 9:50 AM

Pending bills Is Above Rs 14888 crores in various departments - Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన విధంగా నాలుగు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రకారం అత్యవసర బిల్లుల చెల్లింపులు మాత్రమే చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖలకు అల్టిమేటం జారీ చేశారు. మరికొద్ది రోజుల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో హడావుడిగా ప్రవేశపెట్టే కొత్త బిల్లులకు చెల్లింపులు చేయరాదని స్పష్టం చేశారు. కేవలం అత్యవసరమైన పాత బిల్లులే చెల్లించాలని, అది కూడా ఓటాన్‌ అకౌంట్‌ మేరకే ఉండాలని అన్ని శాఖలకు నిర్దేశించారు. మిగతా బిల్లుల గురించి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాతే ఆలోచించాలని ఆదేశించారు. ఈమేరకు ఆర్థిక శాఖ కార్యదర్శులు రెండు రోజుల క్రితం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కింద ఏప్రిల్‌ నుంచి జూలై వరకు  ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయి? ఇప్పటి వరకు ఏ శాఖకు ఎంత బడ్జెట్‌ విడుదలైంది? తదితర వివరాలతోపాటు గత ఆర్థిక ఏడాది బకాయి బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్‌ కుమార్, సత్యనారాయణలు ఈ సమావేశంలో చర్చించారు. 

పూర్తి స్థాయి బడ్జెట్‌ తరువాతే మిగతావి..
ఏప్రిల్‌ నుంచి మే నెల 1వ తేదీ వరకు అన్ని శాఖలకు చెందిన రూ.14,888.42 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటిని ఎలా చెల్లించాలనే విషయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. అవసరమైన బిల్లులను మాత్రమే చెల్లించాలని, నాలుగు నెలల ఓటాన్‌ బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా అత్యవసరం కాని పెండింగ్‌ బిల్లులుంటే వాటిని పక్కన పెట్టాలని సూచించారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ వచ్చిన తరువాతనే వాటి గురించి ఆలోచించాలని ఆదేశించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేటాయింపుల పరిధిలోనే వ్యయం ఉండాలని, ప్రాధాన్యం మేరకు అత్యవసరాలకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు పేర్కొన్నారు. మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు లాంటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మిగతా పనులకు సంబంధించిన బిల్లులకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సరిపోకపోతే వాటిని పక్కన పెట్టాలని, అలాంటి వాటికి పూర్తి స్థాయి బడ్జెట్‌ వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శులు స్పష్టం చేశారు. 

ప్రాధాన్యం మేరకే పంపాలి
ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,26,17,753 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలలకు మాత్రమే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నాలుగు నెలలకు అన్ని శాఖలకు కలిపి రూ.76,816.86 కోట్లను ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. ఇప్పటివరకు రూ.52,997.97 కోట్లను ఆయా శాఖలకు విడుదల చేస్తూ జీవోలను జారీ చేసింది. ఇందులో రూ.20,584 కోట్లను వ్యయం చేశారు. మిగిలిన పెండింగ్‌ బిల్లులు రూ.14,888.42 కోట్లకు సంబంధించి ప్రాధాన్యం మేరకు మాత్రమే ఆర్థిక శాఖకు పంపించాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.  

సీఎఫ్‌ఎంఎస్‌కు లింక్‌ ద్వారా బిల్లుల వివరాలు..
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పంపిణీ, పెండింగ్‌ బిల్లుల వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోగ్రామ్‌లో పొందుపరచడంలో ఆర్థిక శాఖ విఫలమైంది. దీంతో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పోగ్రామ్‌లోనే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పంపిణీ, పెండింగ్‌ బిల్లుల వివరాలను రూపొందించి ఆ లింక్‌ను సీఎఫ్‌ఎంఎస్‌కు ఇచ్చారు. అన్ని శాఖలు ఆ లింక్‌ను పరిశీలించి ఓటాన్‌ బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయాలను పర్యవేక్షించాలని ఆర్థికశాఖ కార్యదర్శులు సూచించారు. ఇదిలా ఉండగా సంక్షేమ రంగాలతో పాటు మంచినీటి సరఫరా తదితర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 

ఓట్ల పథకాలకే బాబు చెల్లింపులు
టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ కేవలం నాలుగు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మాత్రమే అసెంబ్లీ ఆమోదం లభించింది. గత ఆర్థిక ఏడాది చివరి మూడు నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కలిగించే బిల్లులనే భారీగా చెల్లించడంతో బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నప్పటికీ మిగతా బిల్లులు నిలిచిపోయాయి. దీంతో వీటిని ఆర్థికశాఖ ఈ ఆర్థిక ఏడాదికి బదిలీ చేసింది. అయితే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో నాలుగు నెలల బడ్జెట్‌ కేటాయింపుల మేరకు మాత్రమే వ్యయం చేయాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement