సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభం కాని పనులన్నింటినీ రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థికశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సర్కారు చివరి రోజుల్లో హడావుడిగా ఏ శాఖలో, ఏ విభాగంలో ఎంత విలువైన పనులను మంజూరు చేసింది? ప్రస్తుతం వాటి స్థితిగతులు ఏమిటి? అనే వివరాలను ఆర్థికశాఖ సేకరించింది. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు మంజూరు చేసిన పనుల విలువ ఏకంగా రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నట్లు గణాంకాల్లో తేలింది. ఈ పనులన్నీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వీటిని రద్దు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
8,939 పనులు... సాగునీటిలో అత్యధికం
గతంలో చంద్రబాబు సర్కారు కూడా 2014 ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్నెల్ల ముందు మంజూరైన పనులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లకు బిల్లుల చెల్లింపులను కూడా నిలుపుదల చేసింది. అయితే ఇప్పుడు కేవలం ప్రారంభం కాని పనులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో చంద్రబాబు సర్కారు ఈ ఎన్నికలకు ముందు 8,939 పనులను ఆగమేఘాలపై మంజూరు చేసింది. ఈ పనుల విలువ అక్షరాలా రూ. 30,062.41 కోట్లు అని తేలింది. అత్యధికంగా సాగునీటి శాఖలో మంజూరైన పనుల విలువ రూ.10,278.72 కోట్లుగా ఉంది. ఆ తరువాత మున్సిపల్ శాఖలో అంటే సీఆర్‌డీఏతో కలిపి మొత్తం రూ.7,939.96 కోట్ల విలువైన పనులు మంజూరు చేశారు. వీటిని మంజూరు చేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను చెల్లించి కమీషన్లు కాజేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు హడావుడిగా మంజూరైన కొన్ని పనులకు టెండర్లను ఆహ్వానించలేదు. కొన్ని పనులకు ఒప్పందాలు చేసుకోలేదు.
సీఎస్ ఆదేశించినా ఆర్థికశాఖ కార్యదర్శి తాత్సారం
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభించని పనులన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినా ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తాత్సారం చేస్తుండటం పట్ల అధికార వర్గాలు విస్మయం చెందుతున్నాయి. ఈ పనుల రద్దుకు సంబంధించిన ఫైల్ తయారైనప్పటికీ ఆదేశాలు జారీ చేయడానికి రవిచంద్ర ఎందుకు వెనుకాడుతున్నారో అర్ధం కావడం లేదని, ఇక్కడ కూడా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడాలనే ధోరణి కనిపిస్తోందని పేర్కొంటున్నాయి. నిశ్చయ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గవర్నర్ ప్రకటించినప్పటికీ రవిచంద్ర సీఎస్ ఆదేశాలను అమలు చేయకుండా జాప్యం చేయడంలో అర్ధం లేదని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తరువాత చూడవచ్చులే అనే ధోరణిలో రవిచంద్ర వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి.
సీఎస్ చెప్పినా పట్టించుకోని ఆర్థిక కార్యదర్శి
Published Wed, May 29 2019 4:20 AM | Last Updated on Wed, May 29 2019 4:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment