ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర సర్కారు రూ.20,863 కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఓపెన్ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రతినెలా అవసరానికి అనుగుణంగా కొంతమేర రుణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ సమీకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ నుంచి రూ.32,000 కోట్ల రుణం పొందడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గత టీడీపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తొలి త్రైమాసికానికి రూ.8,104 కోట్ల రుణం చేసేందుకు మాత్రమే అనుమతించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఏప్రిల్ 5వ తేదీన ఓపెన్ మార్కెట్ ద్వారా ఒకేసారి రూ.5,000 కోట్ల రుణం తీసుకుంది. మే 2వ తేదీన మరో రూ.500 కోట్ల రుణాన్ని తెచ్చింది. ఇలా తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలను ఎన్నికల్లో తాయిలాలుగా పంచడానికి, అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమీషన్లు కొల్లగొట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం వాడేసింది.
అంతేకాకుండా మే నెలలో మిగతా మొత్తం రుణాన్ని తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)ను కోరింది. అయితే, ఒకే నెలలో భారీగా రుణం తీసుకునేందుకు అనుమతించబోమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నెలకు రూ.2,000 కోట్ల చొప్పున అది కూడా వారానికి రూ.500 కోట్ల మేర రుణం తీసుకునేందుకే అనుమతిస్తామని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ ద్వారా మే 6న రూ.500 కోట్లు, మే 10న రూ.1,000 కోట్లు, మే 30న రూ.1,104 కోట్ల రుణాలను తీసుకొచ్చింది. జూన్‌లో కొత్త అప్పులు చేయడానికి వీల్లేకుండా పోయింది. మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా రుణం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు రూ.20,863 కోట్లు అప్పును ఓపెన్ మార్కెట్ ద్వారా చేసేందుకు అనుమతించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.28,967 కోట్ల అప్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లయ్యింది.
ప్రజాధనం వృథా చేయొద్దు: సీఎం జగన్
రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల నిమిత్తం నెలకు రూ.2,000 కోట్ల చొప్పున ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్‌లో అప్పు చేయనుంది. ఇందులో భాగంగా జూన్ 25న రూ.2,000 కోట్ల అప్పు తీసుకురావాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం మేర బడ్జెట్ లోపల ప్రభుత్వం అప్పు చేసేందుకు వీలుంది. ప్రభుత్వం తెచ్చిన అప్పులను ఉత్పాదక రంగాలపై వెచ్చిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, గత టీడీపీ సర్కారు అప్పులను అనుత్పాదక రంగాలకు వెచ్చించింది. దుబారాగా ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్భాటాలు, హంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయొద్దని, ప్రతి పైసాను పొదుపుగా వాడాలని, తెచ్చిన అప్పులను ఉత్పాదక రంగాలకు, పేదల సంక్షేమానికే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment