సంస్కరణలకు, తప్పులకు తేడా తెలీదా? | Chandrababu government criticized the land reforms during YS Jagan's tenure | Sakshi
Sakshi News home page

సంస్కరణలకు, తప్పులకు తేడా తెలీదా?

Published Thu, Aug 8 2024 8:51 AM | Last Updated on Thu, Aug 8 2024 8:54 AM

Chandrababu government criticized the land reforms during YS Jagan's tenure

గత ఐదేళ్లలో ప్రజలకు మేలు జరిగేలా అనేక భూ సంస్కరణలు 

తన హయాంలో ఎప్పుడూ ఒక్క భూ సంస్కరణ చేయని చంద్రబాబు 

చుక్కల భూములను చిక్కుల్లో పెట్టిన అపర మేధావి 

షరతులు గల భూములను వివాదాస్పదం చేసిన ఘనుడు 

వాటన్నింటినీ పరిష్కరించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే 

రాష్ట్ర చరిత్రలో తొలిసారి అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు 

రీ సర్వే పూర్తయిన 7 వేల గ్రామాల్లో 50 వేలకుపైగా భూ సమçస్యలు పరిష్కారం 

కేవలం రాజకీయం రంగు పులమడమే లక్ష్యంగా ఈ సర్కారు కుయుక్తులు 

అందుకు వంత పాడుతున్న రెవెన్యూ కార్యదర్శి సిసోడియా   

సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన భూ సంస్కరణలపై చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా నిందలు మోపుతోంది. భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమనే దిక్కుమాలిన వాదనను సీఎం మొదలు టీడీపీ కింది స్థాయి నేతలంతా వినిపిస్తున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా కూడా ఇదే పాట పాడడం అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది. 

భూ సంబంధిత అంశాలపై ఎప్పటి మాదిరిగానే విజ్ఞాపనలు వస్తున్నా, టీడీపీ ప్రభుత్వం కావాలని వాటిని భూతద్దంలో చూపిస్తోంది. వచి్చన వినతుల్ని పరిష్కరించకుండా తప్పించుకునేందుకు భూ సమస్యలు కావడం వల్ల ఏమీ చేయలేకపోతున్నామనే పలాయనవాదాన్ని వినిపిస్తోంది. చంద్రబాబు, మంత్రులు చెప్పినట్లు వచి్చన వినతుల్లో 80 శాతం భూములకు సంబంధించినవే అయితే అందుకు గల కారణాలను వెలికి తీయవచ్చు. కానీ అలా చేయకుండా కేవలం గత ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. నిజానికి వైఎస్‌ జగన్‌ హయాంలో భూములకు సంబంధించి అనేక సంస్కరణలు జరిగాయి. 

దశాబ్దాలుగా పేరుకుపోయిన భూముల వ్యవహారాలపై నిర్ణయాలు వెలువడడంతో సహజంగానే కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి. వాటితోపాటు ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి భారీగా వినతులు వచి్చనా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంది. అప్పట్లోనూ సివిల్‌ వ్యవహారాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చేవి. అందుకనుగుణంగా వాటి పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా వాటిపై రాజకీయాలు చేస్తోంది. 

భూ సంస్కరణలు తెచి్చంది జగనే 
భూ సమస్యలను పరిష్కరించడానికి సాహసోపేతంగా అడుగులు వేసి అనేక సంస్కరణలు తీసుకువచి్చంది గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాగా, అసలు  భూ సమస్యల గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అనేక భూ వివాదాలకు కారణమైంది గత చంద్రబాబు ప్రభుత్వం. 2017లో చుక్కల భూముల చట్టం తెచ్చి ఆ భూముల సమస్యను పరిష్కరించకపోగా వివాదాస్పదంగా మార్చింది. స్వాతం్రత్యానికి ముందు నుంచి హక్కులు ఉన్న షరతుల గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వేలాది మంది రైతుల కడుపు కొట్టింది. అనా«దీనం భూముల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసింది. వీటన్నింటినీ పరిష్కరించేలా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. 2 లక్షల ఎకరాల చుక్కల భూములను 22ఎ జాబితా నుంచి బయట పడేయడంతో వాటిని సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. షరతులు గల భూములపైనా ఆంక్షలు లేకుండా చేయడంతో 50 వేల మంది రైతులకు మేలు జరిగింది.
     
పేదలకు 46 వేల ఎకరాలు పంచడం కనిపించలేదా? 
చంద్రబాబు తన పాలనలో ఎప్పుడూ ఒక్క పేద వాడికి భూమి ఇచి్చన పాపాన పోలేదు. వైఎస్‌ జగన్‌ తన హయాంలో 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతులకు పంపిణీ చేశారు. దానిపై టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులతో ఫిర్యాదులు చేయిస్తూ పంపిణీపై నిందలు మోపుతున్నారు. భూమిని పొందిన వారిలో వైఎస్సార్‌సీపీ వారున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పేద వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు అర్హత ప్రకారం భూములు పొందడాన్ని వక్రీకరిస్తున్నారు.  

అసైన్డ్‌ భూములకు హక్కులిస్తే విషం కక్కుతారా? 
చరిత్రాత్మక రీతిలో రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల సమస్య పరిష్కారానికి మార్గం చూపడాన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ వికృతానందం పొందుతోంది. దశాబ్దాల క్రితం భూములు పొందిన వారికి ఆ భూములపై హక్కులు కలి్పంచడాన్ని నేరంగా చిత్రీకరిస్తోంది. 

అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక, అసైన్డ్‌ రైతులు ఎన్నో బాధలు పడినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల కోరికను తీర్చడం కోసం.. ప్రభుత్వం నుంచి పొందిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములపై వారికి సంపూర్ణ అధికారాలు ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల 27 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగే పరిస్థితి ఏర్పడింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అందులో 9 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూములను సాగు చేసుకుంటున్న లక్షల మంది రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు లభించాయి. 

తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అందులో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. హక్కులు వచ్చాక 25 వేల ఎకరాలను అమ్ముకున్నారని అసైన్డ్‌ భూములపై అమలైన సంస్కరణను తప్పుదోవ పట్టిస్తోంది. వీటితోపాటే 1.79 లక్షల ఎకరాల సరీ్వస్‌ ఈనాం భూములను 22ఏ నుంచి తొలగించారు. ఆంక్షల చెరలో ఉండి ఎటూ కాకుండా ఉన్న లక్షల మంది రైతుల భూములపై వారికి హక్కులివ్వడాన్ని ఏమనాలి? రాజధాని పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టి వారికి అన్యాయం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో అసైన్డ్‌ రైతులందరికీ మేలు జరిగేలా అమలైన సంస్కరణను తప్పుగా వక్రీకరించి రాజకీయం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.   

సీఎం మెప్పు కోసం సిసోడియా అత్యుత్సాహం
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెప్పు కోసం పడిన పాట్లు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేశాయి. తాను ఎప్పుడూ చూడని స్థాయిలో భూములపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే కారణమని ఆయన సెలవిచ్చారు. భూ సమస్యలు రావడానికి ఆయన రెవెన్యూ శాఖలో పని చేసింది ఎప్పుడు? ఎప్పుడో కలెక్టర్‌గా చేసిన కొద్దికాలం తప్ప ఆ తర్వాత ఆయన రెవెన్యూ శాఖలో పని చేయనేలేదు. గత పదేళ్లుగా ఆయన కీలక శాఖల్లో పని చేసేందే లేదు. 

ఎడ్డెమంటే తెడ్డెం అనే వైఖరి.. తానే గొప్పవాడిననే అహంభావి కావడంతో ఆయనకు మంచి పోస్టింగ్‌ దక్కలేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెబుతున్నారు. కాలం కలిసి వచ్చి ఇప్పుడు అనుకోకుండా రెవెన్యూ కార్యదర్శి పోస్టు వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఏం చెప్పినా చేసి, ఆయన్ను ఎంతైనా పొగిడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిపోదామనే ఆశ తప్ప ఆయన మాట్లాడేదాంట్లో అర్థం లేదని సీనియర్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. అందుకే మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసును అధికార పార్టీ రాజకీయం చేస్తే, అందులో సిసోడియా కూడా దూరిపోయి డప్పు వాయించేస్తున్నారు. కాలిపోయిన రెవెన్యూ రికార్డులన్నీ రీట్రైవ్‌ అయ్యాయని చెబుతూనే ఫోర్జరీ చేశారు కాబట్టే కాల్చేశారనే వితండ వాదాన్ని వినిపిస్తున్నారు. తాను ఐఏఎస్‌ అధికారిననే విషయాన్ని మరిచిపోయి పోస్టుల కోసం ఇంత దిగజరడం తగదని సాటి అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.  

భూముల రీ సర్వేతో కలిగిన ప్రయోజనాలు తెలియవా? 
దేశంలోనే మొట్టమొదటిసారిగా వందేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ హయాంలో ఏపీలో జరిగిన భూముల రీ సర్వే అద్భుతమని కేంద్రం కితాబిచి్చంది. భూ వివాదాల పరిష్కారానికి ఏకైక మార్గం రీ సర్వే కావడంతో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొని 7 వేల గ్రామాల్లో గత ప్రభుత్వం సర్వే పూర్తి చేసింది. దాన్ని కొనసాగించాల్సింది పోయి రాజకీయ కారణాలతో అభాండాలు వేయడాన్ని రెవెన్యూ యంత్రాంగం తప్పు పడుతోంది. రీ సర్వేపై విషం చిమ్మే క్రమంలో రాష్ట్రంలో ల్యాండ్‌ రికార్డ్స్‌ వెల్‌ సెటిల్డ్‌ అంశమని, బ్రిటీష్‌ హయాంలో చాలా సిస్టమాటిక్‌గా ల్యాండ్‌ రికార్డులు నిర్వహించారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పడం చూసి ఐఏఎస్‌ అధికారులు విస్తుపోయారు. 

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల డిజిటలైజేషన్‌ జరగాలని, అందుకు రీ సర్వే తప్పనిసరి అని చెబుతుంటే ఎన్డీయేలోనే ఉన్న చంద్రబాబు అందుకు విరుద్ధంగా సొంత వాదనలు వినిపించడం విడ్డూరం. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం బ్రిటీష్‌ హయాంలో రికార్డులు కచ్చితంగా ఉంటే భూ వివాదాలు కుప్పలు తెప్పలుగా ఎందుకు వస్తున్నాయి? తన రాజకీయాల కోసం ఎలాంటి అబద్ధాలైనా ఆడడంలో చంద్రబాబును మించిన వారు లేరని రీ సర్వేపై ఆయన చేస్తున్న అడ్డగోలు వాదనలే నిదర్శనం. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకురావడానికి ఐదేళ్లపాటు రెవెన్యూ యంత్రాంగం కష్టపడి చేసిన సాహసోపేతమైన కార్యక్రమంపై బురదజల్లడం విజనరీ చంద్రబాబుకే సాధ్యం. 

రీ సర్వే ద్వారా ప్రతి గ్రామానికి ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకు భూ హక్కు పత్రం, భూములకు జియో హద్దులు వంటి అనేక ప్రయోజనాలున్నాయి. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్‌ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. ఇదంతా మంచి కాదా? గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు చేసే కార్యక్రమం మొదలైంది. వీటన్నింటినీ కాదని మళ్లీ వివాదాస్పద పాత భూముల వ్యవస్థనే తీసుకువస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఏమనాలి?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement