రోగుల ప్రాణాలతో చెలగాటం! | Govt doctors are neglecting the patients | Sakshi
Sakshi News home page

రోగుల ప్రాణాలతో చెలగాటం!

Published Sun, Aug 28 2016 4:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

రోగుల ప్రాణాలతో చెలగాటం!

రోగుల ప్రాణాలతో చెలగాటం!

  • మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో మహిళా వైద్యుల నిర్లక్ష్యం
  • రోగులను పట్టించుకోని వైనం
  • ప్రైవేట్‌ ప్రాక్టీస్‌లకే ప్రాధాన్యం
  • తాజాగా గర్భిణికి వైద్యం చేయని వైద్యురాలు
  • పైగా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిన ఉదంతం
  • నిరుపేద రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ తమ బాధ్యత మరిచి సమయపాలన పాటించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేమని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. అందుకు కారణం అక్కడ పనిచేసే ఇద్దరు మహిళా వైద్యులు అధికార పార్టీ నేతల కోడళ్లు కావడమే. ఇది మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న తంతు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నా, ఉన్నతాధికారులు వారి జోలికి వెళ్లాలంటే వెనుకంజ వేస్తున్నారు.
     
    సాక్షి, గుంటూరు: వైద్యో నారాయణో హరి.. అంటూ వైద్యుడిని భగవంతుడితో సమానంగా కీర్తించటం తెలిసిందే. సమాజంలో వైద్యుడికి ఇచ్చే గౌరవమది. కానీ కొందరు వైద్యులు తమ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తుండటం శోచనీయం. నిరుపేద రోగులకు వైద్యం అందించే క్రమంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించటమే గాక.. వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కాన్పు కోసం వచ్చిన గర్భిణికి వైద్యం అందించకుండా అక్కడి వైద్యురాలు రాజీనామా చేసి వెళ్లిపోయింది. ఈ ఉదంతంలో అదృష్టవశాత్తూ బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు.
     
    పురిటి నొప్పులతో కాన్పు కోసం వస్తే...
    దుర్గి మండలం పోలగట్ల గ్రామానికి చెందిన చాట్ల సాగరమ్మ అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మాచర్ల ప్రభుత్వాస్పత్రికి ఆమెను తీసుకొచ్చారు. వైద్యులు ఎవరూ లేకపోవడంతో నాలుగు గంటల పాటు నొప్పులతో బాధపడుతూనే గర్భిణి ఎదురుచూసింది. ఉదయం 8.30 తర్వాత వచ్చిన వైద్యురాలిని ఆలస్యంగా రావటంపై గర్భిణి బంధువులు ప్రశ్నించడంతో.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తాను రాజీనామా చేస్తున్నానని చెప్పి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్య సేవలు అందించకుండానే వెళ్లిపోవటం గమనార్హం. అక్కడే ఉన్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శిరీష కూడా తాను పిల్లల డాక్టర్‌నంటూ వైద్యం చేసేందుకు నిరాకరించటంతో విధిలేక బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ వైద్యులు పెద్ద మనసు చేసుకుని చికిత్స అందించటంతో బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. 
     
    ప్రశ్నించేవారు ఉండరనే...
    మాచర్ల నియోజకవర్గంలో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలే. మాచర్ల రూరల్, వెల్దుర్తి, దుర్గి, విజయపురిసౌత్‌ మండలాల్లో ఏ గ్రామంలో ఎలాంటి రోగం వచ్చినా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీయాల్సిందే. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకునే స్థోమత లేక నిరుపేద రోగులంతా ఇక్కడికి వస్తుంటారు. 30 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో గతంలో ఎనిమిది మంది వైద్యులు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉండగా, వారిలో ఇద్దరు అధికార పార్టీ నేతల కోడళ్లు. తమను ప్రశ్నించేవారు ఉండరనే ధైర్యంతో వారు ఇష్టం వచ్చినప్పుడు ఆస్పత్రికి రావడం కొద్దిసేపు ఉండి తిరిగి సొంత ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం జరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆస్పత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 
     
    అధికారం అండతో...
    మాచర్ల ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్టు వైద్యురాలు డాక్టర్‌ కొమ్మారెడ్డి రోహిణి టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి కోడలు కాగా, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శిరీష ప్రస్తుత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నెల్లూరి మంగమ్మ కోడలు. దీంతో వీరిద్దరినీ ప్రశ్నించే ధైర్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఉన్నతాధికారులు సైతం చేయడం లేదు. మామూలుగా ఉద్యోగం నుంచి మానుకోవాలన్నా, సెలవు పెట్టాలన్నా ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ శుక్రవారం గర్భిణికి వైద్య సేవలు అందించకుండా అక్కడి నుంచి డాక్టర్‌ రోహిణి వెళ్లిపోవడంపై జిల్లాలోని వైద్య నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శిరీష సైతం బాధిత గర్భిణిని గుంటూరుకు తరలించి చేతులు దులుపుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే తమ పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యుల తప్పునకు ఓ గర్భిణి మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement