ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ
వైద్య సేవలపై అసంతృప్తి
మంచిర్యాల టౌన్ : జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డు, మందుల నిల్వ, వివిధ వ్యాధుల పరీక్షల ల్యాబ్, ఎక్స్‌రే రూం, సురక్ష క్లీనిక్, టి.బి గది, ఆరోగ్యశ్రీ వార్డు, శస్త్ర చికిత్సల రోగుల వార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై కొంత సంతృప్తి వ్యక్తం చేసినా, ఇతరత్రా సౌకర్యాలు రోగులకు కల్పించడం, పారిశుధ్యంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ ఉందని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని, ప్రస్తుత ఆసుపత్రిలో అందుబాటులోఉన్న వైద్య సేవలను జిల్లా ప్రజలకు నిరంతరాయంగా అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీరజను ఆదేశించారు. రెడ్‌క్రాస్ సంస్థలో నిల్వ ఉన్న రక్తాన్ని మొదటగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు.
మలేరియా, టైఫాయిడ్, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నింటికీ ఒక సమీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు. టీబీ రోగుల వివరాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి తగు వైద్యసేవలను అందించాలన్నారు. త్వరలోనే జిల్లా ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు కానున్నందున ప్రజలకు మరింత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని , వైద్య సిబ్బంది అంకితభావంతో నిరంతరాయంగా అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు.
వైద్య సేవలందేలా చూడాలి
Published Fri, Oct 14 2016 9:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement