rv karnan
-
Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీ మ జిల్లా సకినేటి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రితోపాటు కనిపించకుండా పో యిన చిన్నారి అక్ష తల్లిదండ్రుల చెంతకు చేరింది. జిల్లా అధికారుల కృషితో పాపను సోమవారం తల్లిదండ్రులు ద్వారక, రవికుమార్‌కు సీ డబ్ల్యూసీ అధికారులు అప్పగించారు. వివరా లు.. ఈనెల 11న జిల్లాలోని సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్కు చెందిన మహిళ వద్ద అక్షను గ్రామస్తులు గుర్తించారు. బాలికకు ఎవరూ లే రని, ఉంటే చేరదీయాలని వాట్సాప్ ద్వారా స ర్పంచ్ కొత్త రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తి రుపతిరెడ్డి ప్రతిగ్రూప్‌లో షేర్ చేస్తూ సైదాపూర్ ఎస్ఐ సెల్ నంబర్‌ను పొందుపరిచారు. ఈక్రమంలో పాప కోసం రెండు కుటుంబాలకు చెందిన వారు అధికారులను ఆశ్రయించారు. కానీ పూర్తి ఆధారాలతో రావాలని శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు పూర్తి ఆధారాలు సమర్పించారు. దీంతో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. అధికారులను అభినందించిన కలెక్టర్ కరీంనగర్: చిన్నారి అక్షను సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాప వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. చిన్నారికి చాక్లెట్లు, పెన్ను, పుస్తకం అందజేశారు. పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కృషిచేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యరాణి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, సభ్యులు రెండ్ల కళింగశేఖర్, రాధ, అర్చన, విజయ్, డీసీపీఓ శాంత, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కోఆరి్డనేటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు రుణం
కరీంనగర్: ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌కు సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశంలో ట్రాన్స్‌జెండర్‌కు రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ ఆషాడం ఆశ (ఎస్సీ)కు ఫొటోగ్రఫీ యూనిట్ స్థాపన కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మరో ట్రాన్స్‌జెండర్ నక్క సింధుకు.. ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆయన అందజేశారు. -
రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్
కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల క్రమంలో కోడ్ పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. -
ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రెయిలర్, ట్రాక్టర్ ట్రెయిలర్, కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్‌లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. -
ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుగా నిర్ణయించుకుని (ప్రీ డిటర్మైండ్) వచ్చి తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ తీర్పును కొట్టివేయాలంటూ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అప్పీల్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జికి ఉద్దేశాలను ఆపాదించడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడింది. న్యాయస్థానంలో దాఖలు చేసే పిటిషన్లలో సంతకాలు చేసే ముందు సంబంధిత అన్ని అంశాలను జాగ్రత్తగా చదువుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఈ తరహా వ్యాఖ్యలను అనుమతించమని, ప్రభుత్వ న్యాయవాదులు అప్రమత్తంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పిటిషన్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అప్పీల్లో ఈ తరహా అంశాలను పేర్కొన్నందుకు వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్ కర్ణన్ సహా స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జిపై చేసిన వ్యాఖ్యల అంశాలను అప్పీల్ నుంచి తొలగించేందుకు అనుమతించాలంటూ అభ్యర్థించడంతో ఎ.సంజీవ్‌కుమార్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును రీకాల్ చేసింది. కలెక్టర్‌ను మాత్రం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నిబంధనల కు విరుద్ధంగా కొందరు రైతులమని చెబుతూ గ్రామీణ వికాస బ్యాంక్ నుంచి రుణాలు పొందారంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్‌ను 2019, డిసెంబర్ 11న ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో వెంకట్రామయ్య గత ఏడాది సెప్టెంబర్‌లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కలెక్టర్ స్పందించారని, హైకోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌కు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ రూ.500 జరిమానా విధించారు. ఈ డబ్బును కలెక్టర్ జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణన్ అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అని, కోర్టుల మీద గౌరవం కలిగిన అధికారిగా ఆదేశాలను అమలు చేస్తున్నారని సంజీవ్‌కుమార్ వివరించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... ఈ నెల 10న కలెక్టర్ కర్ణన్ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మీకు అర్థమవుతోందా..!
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు షురువయ్యాయి. 3 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్ తరగతులను వీక్షించారు. విద్యార్థులు పాఠాలు వింటున్నారా.. లేదా..? అనే విషయాన్ని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌తో సహా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అంతేకాక.. ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేయడంతో వారు కూడా విధుల్లో చేరారు. సాక్షి, ఖమ్మం: కోవిడ్–19 (కరోనా) ప్రభావం కారణంగా మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాఠశాలలు, అటు కళాశాలలు తెరిచేందుకు వేచి చూస్తూ వస్తోంది. నెలలు గడుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను గత నెల 27వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే కళాశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు విధుల్లో చేరడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా విధుల్లోకి తీసుకున్నారు. దూరదర్శన్, టీ–శాట్ ద్వారా తరగతులు.. ఇళ్లలో నుంచే విద్యార్థులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు వీక్షించారు. విద్యార్థులు టీ–శాట్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని తరగతులు విన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయం లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆన్లైన్ తరగతులు వినే సదుపాయం కల్పిస్తారు. తొలిరోజు మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు తెలుగు, 10.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. 7వ తరగతి విద్యార్థులకు 12 గంటలకు తెలుగు, 12.30 గంటలకు లెక్కల సబ్జెక్ట్‌ను బోధించారు. 6వ తరగతి విద్యార్థులకు 2 గంటలకు తెలుగు, 2.30 గంటలకు లెక్కలు, 8వ తరగతి విద్యార్థులకు 3.30 గంటలకు లెక్కలు, 9, 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, 4.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా పర్యవేక్షించారు. వాట్సాప్‌లో 30 నుంచి 40 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేసి.. వారికి వాట్సాప్ ద్వారా ఏ సమయంలో.. ఏ తరగతి విద్యార్థులకు.. ఏ సబ్జెక్టు బోధిస్తారో తెలియజేశారు. అలాగే ఆన్లైన్లో విన్న తరగతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఫోన్ చేసి విద్యార్థులు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కాగా.. రఘునాథపాలెం మండలం కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో ఆన్లైన్ తరగతులను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు తప్పనిసరి: కలెక్టర్ కర్ణన్ రఘునాథపాలెం: ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థుల హాజరును ప్రతి రోజూ తప్పక తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్లైన్ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులు పాఠాలు వినేందుకు చేసిన ఏర్పాట్లను, పాఠాలు వింటున్న తీరును డీఈఓ మదన్మోహన్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం అనితాదేవితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వింటున్నారా.. లేదా.. అనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌కు ఒకరిని బాధ్యులుగా చేసి.. వారి పరిధిలో ఆన్లైన్ బోధన సక్రమంగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ నోట్ చేసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల సెల్ నంబర్లు ప్రతి విద్యార్థి వద్ద అందుబాటులో ఉంచాలని డీఈఓను ఆదేశించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. డీటీహెచ్, స్థానిక కేబుల్ ఆపరేటర్లు తరగతుల ప్రసారానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ వి.ఆశోక్‌కుమార్, గ్రామ సర్పంచ్‌లు మాధంశెట్టి హరిప్రసాద్, రామారావు, ఉప సర్పంచ్‌లు పూర్ణచంద్రరావు, నున్నా వెంకటేశ్వర్లు, హెచ్ఎం అనిత, గ్రామ కార్యదర్శులు సంగీత, శృతి పాల్గొన్నారు. తరగతులు పర్యవేక్షించాం.. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ప్రారంభమయ్యాయి. ఇటీవల అధ్యాపకులకు ఆన్లైన్ బోధనపై శిక్షణ ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఆన్లైన్ తరగతులను అధ్యాపకులు పర్యవేక్షించారు. సందేహాలుంటే అధ్యాపకులను ఫోన్లో సంప్రదించి తెలుసుకోవచ్చు. – కె.రవిబాబు, ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం -
ఎంతో చూశా.. చేశా
సాక్షి, ఖమ్మం: చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఈ కాలం మధురానుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులే కాకుండా మంచి అవగాహన కలిగిన వారని, అందువల్లే జిల్లాలో తన హయాంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామినయ్యానని పూర్తి సంతృప్తి ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఈనెల 30వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ‘సాక్షి ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా.. వరుస ఎన్నికల నిర్వహణతో ఇబ్బంది పడ్డారా? కలెక్టర్‌గా 2018, ఆగస్టు 30వ తేదీన నేను బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత వరుసగా లోక్‌సభ, మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఎలక్షన్లు నాకు మంచి అనుభవాన్ని ఇవ్వడంతోపాటు జిల్లా ప్రజలకు చేరువ కావడానికి ఉపయోగపడ్డాయి. చైతన్యవంతమైన రాజకీయ జిల్లాగా పేరొందిన ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలతోపాటు ప్రజలు పూర్తి సహకారం అందించారు. అందుకే..ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిచేయగలిగాం. ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనపై మీ కృషి ఏ మేరకు ఫలించింది? కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చేసిన ప్రయత్నం జిల్లాలో మంచి ఫలితాలను ఇచ్చింది. నమోదు గణనీయంగా పెరిగింది. రెండు సంవత్సరాల నా పదవీ కాలంలో అనేక ఎన్నికలు నిర్వహించా. ఓటర్ల జాబితాపై దృష్టి సారించి..వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను తొలగించి..ఒకేచోట ఓటు హక్కు ఉండేలా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పూర్తి చేశాం. కొత్త పరిశ్రమలు రానున్నాయా..? జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. సుబాబుల్, జామాయిల్ పండించే రైతులు ఇప్పుడు ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించడంతో ఫ్యాక్టరీ ఆవశ్యకత పెరిగింది. అనేక ప్రైవేట్ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం ఉంది. పంటల నిల్వ చర్యలేంటి? జిల్లాలో పండించే పంటలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే కోవిడ్ కారణంగా మిర్చి పంట ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. వచ్చే రెండు నెలల్లో స్థానిక మార్కెట్లోనే మిర్చికి మంచి ధర లభిస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పండిన పంటలకు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు దాదాపు సరిపోయే అవకాశం ఉంది. భూ ప్రక్షాళన ఏ విధంగా కొనసాగుతోంది? దాదాపు పూర్తయింది. ప్రభుత్వం రైతులకు రైతుబంధు అందజేస్తోంది. వివిధ కారణాల వల్ల ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారంపై దృష్టి సారించాం. నియంత్రిత సాగు గురించి..? మంచి ఫలితాలను ఇస్తోంది. గత సంవత్సరం 90వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు.. ఈసారి 900 ఎకరాలకే పరిమితవడం ఓ మంచి ఉదాహరణ. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లా రైతులు స్పందించిన తీరు ప్రశంసనీయం. ‘మిషన్ నారి’పై దృష్టి సారించారు కదా..? జిల్లాలో 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలికలకు మిషన్ నారి పథకం కింద వైద్య ఆరోగ్య శాఖలోని మహిళా సిబ్బందితో జిల్లా అంతటా పరీక్షలు నిర్వహించాం. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ప్రత్యేకంగా వైద్య సౌకర్యం కల్పించాం. ఆరోగ్యపరమైన ఇతర సమస్యలను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందించాం. జిల్లా అభివృద్ధిలో మీ ప్రాధాన్యాలేంటి..? పూర్తి వ్యవసాయాధారిత జిల్లా. ఆలు, సోయాబీన్ మినహా అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారు. వారి నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దడానికి జిల్లా కలెక్టర్‌గా తొలి ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి, మలి ప్రాధాన్యం వైద్య ఆరోగ్య రంగానికి ఇచ్చి ప్రధానంగా దృష్టి సారించా. దీంతో రైతులకు అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లభించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలు నేను రావడానికి ముందు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 520కు పెంచాం. 220 పడకలకు ఆక్సిజన్ సదుపాయం, 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించాం. ప్రభుత్వ ఆస్పత్రులపై జిల్లా ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించడంతో ఇన్‌పేషెంట్, ఔట్పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండు అవార్డులతో ప్రోత్సాహం శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాం. ప్రతి నియోజకవర్గంలోనూ గతం కంటే పోలింగ్‌శాతం పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అవార్డు ప్రకటించడం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం అవార్డు అందించింది. -
తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్
సాక్షి, ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో ఇళ్లు కూల్చేందుకు వెళ్లిన అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్‌లు సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో ఇల్లు కూల్చడానికి వచ్చామన్న అధికారుల వాదనపై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ.. తాను ఆదేశాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధిత అధికారులను సరెండర్ చేస్తామని అన్నారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొసీజర్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (సోషల్ మీడియాలో‘జస్టిస్ ఫర్.. పోస్టులు) కాగా, తీర్థాలలోని సంగమేశ్వరస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ శనివారం అధికారులు వాటిని కూల్చేందు యత్నించారు. ఈ ఉదయం రెవెన్యూ, పోలీసులు, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అక్కడికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గూమిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్పంచి బాలూనాయక్ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా.. సర్పంచి భార్య, ఆమె సోదరుడు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో కోప్రోద్రిక్తులైన గ్రామస్థులు అధికారులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో దేవాదాయ అధికారులు అక్కడి పరిస్థితిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు ఫోన్లో వివరించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. -
అంతంకాదిది.. ఆరంభమే..
సాక్షి, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక నెల రోజులతోనే అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పనులను గుర్తించడం.. పరిష్కరించడం.. కొనసాగించడంపై నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. జిల్లాలో డీఆర్డీఏ ద్వారా నిరంతరం పనులు కొనసాగించాలని సూచించారు. సర్పంచ్‌తో సహా అంతా ఐక్యంగా ఉండి.. కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో నిరూపించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు గ్రామ పంచాయతీ నిధులను పెంపొందించేందుకు వందశాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి బుధవారం మండల స్థాయిలో జరిగే సమావేశానికి సర్పంచ్‌లు సైతం హాజరయ్యేలా సర్క్యులర్ జారీ చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. 584 గ్రామ పంచాయతీల్లో.. 100 జీపీల్లో డంపింగ్ యార్డులు ఉంటే.. ఇప్పటికే సుమారు 500 డంపింగ్ యార్డులకు స్థలాలను గుర్తించామన్నారు. అదే విధంగా 75 శ్మశాన వాటికలు ఉంటే, ప్రస్తుతం 520 శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. జిల్లాలో త్వరలో రాష్ట్రస్థాయి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శిస్తాయని, ఎక్కడైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్చార్జ్ డీపీఓ హన్మంతు కొడింబా మాట్లాడుతూ 30 రోజులుగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేశారన్నారు. మరో నెల రోజులు కూడా వాటిని కొనసాగించేందుకు యాక్షన్ ప్లాన్‌పై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో సర్పంచ్‌తోపాటు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి గుణాత్మక మార్పును తీసుకొచ్చారన్నారు. ప్రతి జీపీ నుంచి అధికారులు సమర్పించిన వివరాలను ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించి.. ఇవన్నీ సరైన వివరాలే అని నిర్ధారించి ఆన్లైన్లో నమోదు చేశారని, ఈ వివరాలు రాష్ట్రస్థాయి వరకు ఉంటాయని, ఏమైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచ్ల ఆవేదన కాగా.. సర్పంచ్‌లు తమ ఆవేదనను కలెక్టర్ కర్ణన్ ఎదుట వెలిబుచ్చారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేయాలని ఆదేశించారని.. మేం క్షేత్రస్థాయిలో పనులు చేస్తుంటే నగదు అందించడం లేదని వాపోయారు. విద్యుత్ శాఖాధికారులు పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదని, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికకు సంబం«ధించిన స్థలాల అంశం, ఒక ప్రాంతంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు వేర్వేరుగా పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే తదితర సమస్యలను వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కర్ణన్ సమన్వయంతో ముందుకెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి బి.ప్రవీణ, డీఆర్డీఓ ఇందుమతి, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్ జెడ్పీ సీఈఓ ప్రియాంక, విద్యుత్ శాఖ డీఈ రామారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్పంచ్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
వీరిద్దరూ ‘భళే బాసులు’
వీరిద్దరూ జిల్లా బాసులు. ఒకరు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మరొకరు నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. వీరిద్దరు కాసేపు తమ హోదాను పక్కన పెట్టి చిన్న పిల్లల్లా మారిపోయారు. బ్యాటరీ బైక్‌లు నడిపి ముచ్చట తీర్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బ్యాటరీ బైక్‌లను రూపొందించి... ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. వాటిని ఆసక్తిగా తిలకించిన కలెక్టర్, ఎస్పీ వాటిపై కాసేపు మైదానంలో కలయతిరిగారు. వీరు బైక్ నడపడాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని ఖమ్మం సాక్షి ఫోటో జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించారు. పేపర్ బేబీ.... ఇదేదో మోడ్రన్ ఫ్యాషన్ కాదు...ఫ్యాషన్ షో అంతకన్నా కాదు. ఈ చిన్నారి వేసుకున్న డ్రెస్‌ను చూసిన వారంతా వావ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న జరిగిన స్వాతంత్ర్య వేడులకు బూర్గంపాడు పాఠశాలకు చెందిన సాలేహా న్యూస్‌పేపర్‌తో తయారు చేసిన డ్రెస్ ధరించి వచ్చింది. ఆ చిన్నారిని చూసి వారేవా పేపర్ డ్రస్ అంటూ మెచ్చుకున్నారు. -
పొలం గట్లపై కలెక్టర్ దంపతులు
సాక్షి, ఖమ్మం: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆయన సతీమణి జెడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి గురువారం పొలం గట్లపై కలియతిరిగారు. కామేపల్లి మండలం పొన్నెకల్లు-నెమలిపురి మధ్యలో ఉన్న బుగ్గవాగు చెక్ డ్యాం ఫీడర్ చానల్ పనులను ఆయన పరిశీలించారు. కట్టు కాలువ చూసేందుకు దారి లేకపోవడంతో పొలం గట్లపై కలెక్టర్ దంపతులు గంటసేపు నడిచి వెళ్లారు. వంతెన ఎక్కి వాగును దాటి... ఐటీడీఏ పీఓకు నీల్వాయివాగు కష్టాలు నీల్వాయివాగు కష్టాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) కృష్ణ ఆదిత్యకు కూడా తప్పలేదు. వాగు దాటడానికి 28 గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నిత్య కష్టాలను ఆయన చవిచూశారు. గురువారం ఇతర అధికారులతో కలసి మండలంలో ఆకస్మిక తనిఖీకి వచ్చారు. మార్గమధ్యలో ఉన్న నీల్వాయివాగు వరకు తన వాహనంలో వచ్చారు. వాగు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోగా వాగు దాటలేని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం. అక్కడే మామిడి తోటల్లో వాహనాలను నిలిపేసి పక్కనే ఉన్న అసంపూర్తి హైలెవల్ వంతెన వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు నిర్మించలేదు. ప్రజలు ఎక్కేందుకు కొద్దిపాటి మట్టి పోయించారు. వాహనాలు, బైక్‌లు కూడా దాటలేవు. వర్షాలకు మట్టి తడిసి రాకపోకలతో బురదగా మారింది. చేసేదేమీలేక ప్యాంట్, చెప్పులు పట్టుకుని.. వర్షంలో తడుస్తూ మోకాలు లోతు బురదలో జారుతూ అతికష్టం మీద 10 మీటర్ల వంతెనపైకి ఎక్కారు. దిగేచోటా అతికష్టంగా.. దిగారు. ప్రధాన రహదారి వరకు బురదలో నడుచుకుంటూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న ప్రైవేట్ వాహనం అద్దెకు మాట్లాడుకుని మండల కేంద్రానికి వచ్చి వెళ్లారు. -
ఒక్క క్లిక్‌తో.. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదులు
సాక్షి, పాల్వంచరూరల్: ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెట్టేందుకు ఈసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. కోడ్ ఉల్లంఘన, అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో సమాజంలోని ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేసేందుకు ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ యాప్‌ను రూపొందించింది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్లే విధంగా దీన్ని తయారు చేశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో తొలిసారిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్‌ను ఉపయోగించారు. అప్పుడు మంచి స్పందన రావడంతో దాన్ని ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. వంద నిమిషాల్లోనే.. స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్ ప్లే స్టోర్‌లో సీ విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో గానీ, వీడియో గానీ తీసి.. దాన్ని యాప్‌లో అప్లోడ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండటం.. ఇలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్లోడ్ చేయొచ్చు. సీ విజిల్ యాప్‌లో అప్లోడ్ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుంది. యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుంది. 3లోగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ - ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మంసహాకరనగర్: సార్వత్రిక ఎన్నికలను పురష్కరించుకొని జిల్లాలో ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులకు ఈవీఎం కమీషనింగ్‌పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల కమీషనింగ్‌పై సెక్టోరియల్ అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి తిరిగి ఫొటో ఓటర్ స్లిప్పులను అందజేయాలన్నారు. ఏజెంట్లు స్వయంగా ఎట్టి పరిస్థితుల్లో ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయరాదన్నారు. శాసన సభ ఎన్నికల మాదిరగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దివ్యాంగ, గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధులకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, సెక్టోరియల్ అధికారులు, జిల్లా స్థాయి నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
కౌలు రైతులపై పిడుగు
సాక్షి, భీమారం(చెన్నూర్): మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతులు ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి రాజయ్య(32), ముడిపల్లిరాజం(50), జాడి రమేశ్(28) వరి కల్లాల వద్ద ఉన్న వరిధాన్యానికి కాపలా ఉండేందుకు వెళ్లి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారజామున మూడు గంటల ప్రాంతంలో వర్షంతో పాటు ఏకధాటిగా పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో వారిపై పిడుగులు పడి అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామ శివారుల్లో ఉన్న వరి కల్లం వద్దకు సుధాకర్ అనే వ్యక్తి గమనించి వచ్చే వరకు రైతుల మరణ వార్తను గ్రామస్తులకు చెప్పాడు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరణించిన రైతు కుటుంబాలకు ఒక్కొరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు విప్ ఓదెలు, కలెక్టర్ కర్ణన్ హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50 వేలు చెక్కులను అందజేశారు. జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ భూమేశ్వర్, జైపూర్ ఏసీపీ సీతారామలు, సీఐ నారాయణ ఆరేపల్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తెల్లారితే వడ్లని తీసుక పోయేవారు: రైతులు ఆరెపల్లిలో రైతులు ఆరబెట్టిన వడ్లను భీమారంలోని కొ నుగోలు కేంద్రం నిర్వాహులు ఆదివారం తరలిస్తామని చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక ఆరెపల్లి వరిధాన్యం మొత్తం భీమారం తరలిస్తుంటారు. ఈమేరకు శనివారం ఐకేపీ వీవో సభ్యులు ఆరెపల్లికి వెళ్లి వరి ధాన్యం పరిశీలించారు. తేమ శాతం సరిపోను ఉందని ఆదివారం తీసుకెళ్తామని చెప్పి వెళ్లినట్లు రైతులు పేర్కొన్నారు. ఇంతలోనే అంత పనిజరిగిందా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిన పడ్డ కుటుంబాలు పిడుగుపాటు గురై మృతి చెందిన ముగ్గురు రైతులకు స్వంత భూమి కూడా లేదు. వీరు ఇతురుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఆరెపల్లిలో గతంలో కన్నా ఇప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందడంతో వ్యవసాయంపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ముగ్గురు రైతులు కూలీ పనులు మానుకుని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముడిపల్లి రాజం ఏడెకరాలు, రాంటుంకి రాజయ్య నాగుగెకరాలు, జాడి రమేశ్ ఆరెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల మరణంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతి చెందిన జాడిరమేశ్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. మిడిపల్లి రాజంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాటెంకి రాజయ్యకు భార్య రాజేశ్వరి, కూతురు రవళి, కుమారుడు అంజి ఉన్నారు. -
వృద్ధుల డే కేర్..
మంచిర్యాల నుంచి బన్నా ఉపేందర్ : వారంతా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నవారే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం, మరొకరు ప్రైవేటు, మరొకరు వ్యవసాయం, వ్యాపారం.. ఇలా రకరకాలుగా అలుపెరగని జీవిత పోరాటం చేసి నేడు అలసిసొలసిన వృద్ధులు. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే ఏం తోచదు. బయటకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక తమ కష్టసుఖాలను నలుగురితో పంచుకుందామంటే, ఎవరు అందుబాటులో ఉన్నారో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న వృద్ధులకోసం ఏర్పాటైందే వృద్ధుల డే కేర్ సెంటర్. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం తీసుకుని స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే దారిలోని కాలేజీరోడ్డులో ఉన్న ఓ పాత భవనాన్ని రూ. 20 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి ఈ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భవన ఆవరణను అందమైన మొక్కలతో ముస్తాబు చేయించారు. గదిలో టీవీ, ఆడుకునేందుకు వస్తువులు, కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, ఫిజియోథెరపీ పరికరాలు ఇలా అనేకం సమకూర్చారు. ఈ డే కేర్ సెంటర్‌కు మహిళలు, పురుషులు ఎవరైనా ప్రతి రోజూ వచ్చి వెళ్లొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదు. అన్ని రకాల సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ సెంటర్ చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో, పచ్చని గార్డెనింగ్‌ను ఏర్పాటు చేసి, కేంద్రానికి వచ్చే వృద్ధులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నారు. రాష్ట్రంలోనే మొదటిది.. తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధు లకు కాలక్షేపంతోపాటు, ఆరోగ్యాన్ని అందిం చేలా వైద్య పరీక్షలు, ఉల్లాసం, ఉత్సాహం నింపే లా ఆట వస్తువులు, వినోదం అందించేందుకు టీవీ, దినపత్రికలతో మంచిర్యాలలో వృద్ధుల డే కేర్ సెంటర్ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చొరవతో ఏర్పాటైన దీనికి ‘సన్‌షైన్ వృద్ధుల డేకేర్ సెంటర్’ అని పేరు పెట్టారు. డే కేర్ సెంటర్ ఉద్దేశం.. వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, వారి హక్కుల గురించి గానీ, వారికి ప్రభుత్వం అందించే సదుపాయాలు, పథకాల గురించి తెలుసుకునేందుకు, కష్టసుఖాలు పంచుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాటు చేసిందే ఈ కేంద్రం. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ప్రతీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఫిజియో థెరపీ అవసరం ఉన్న వారికి సైతం ప్రత్యేకంగా ఒక బెడ్డు, సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల దిన పత్రికలు, వినోదాన్ని పంచేందుకు టీవీ, ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం చేసేందుకు చెస్, క్యారంబోర్డు ఉన్నాయి. షటిల్‌కోర్టు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచి వేదిక అన్ని హంగులతో రూపొందించిన డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయ డం గొప్ప వరం. ఎక్కడా లేనివిధంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు. వృద్ధులు అనేక విషయాలు పంచుకునేందుకు ఇదో వేదిక. 2007లో ఏర్పాటు చేసిన మెయిం టెనెన్సు సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పిస్తాం. – బొలిశెట్టి రాజలింగు, జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడు మరో పదేళ్లు బతకొచ్చు.. వృద్ధులైన తర్వాత ఏం తోచక సమయాన్ని వృథా చేసుకుంటూ, ఆరోగ్యపరంగా, మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఈ డే కేర్ సెంటర్‌కు రావడం వల్ల కొత్త పరిచయాలు, కొత్త విషయాలను తెలుసుకోవడం, రోజంతా నవ్వుతూ, బాధలు, సంతోషాలను పంచుకుంటుండడం వల్ల మరో పదేళ్ల ఆయుష్షు పెరుగుతుంది. – ఎన్. వెంకటేశ్వర్రావు, సీనియర్ సిటిజన్ అసోసియేట్ అధ్యక్షుడు -
వైద్య సేవలందేలా చూడాలి
ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ వైద్య సేవలపై అసంతృప్తి మంచిర్యాల టౌన్ : జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డు, మందుల నిల్వ, వివిధ వ్యాధుల పరీక్షల ల్యాబ్, ఎక్స్‌రే రూం, సురక్ష క్లీనిక్, టి.బి గది, ఆరోగ్యశ్రీ వార్డు, శస్త్ర చికిత్సల రోగుల వార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై కొంత సంతృప్తి వ్యక్తం చేసినా, ఇతరత్రా సౌకర్యాలు రోగులకు కల్పించడం, పారిశుధ్యంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ ఉందని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని, ప్రస్తుత ఆసుపత్రిలో అందుబాటులోఉన్న వైద్య సేవలను జిల్లా ప్రజలకు నిరంతరాయంగా అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీరజను ఆదేశించారు. రెడ్‌క్రాస్ సంస్థలో నిల్వ ఉన్న రక్తాన్ని మొదటగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. మలేరియా, టైఫాయిడ్, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నింటికీ ఒక సమీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు. టీబీ రోగుల వివరాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి తగు వైద్యసేవలను అందించాలన్నారు. త్వరలోనే జిల్లా ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు కానున్నందున ప్రజలకు మరింత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని , వైద్య సిబ్బంది అంకితభావంతో నిరంతరాయంగా అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు.