జగ్గయ్యపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనం, తొర్రగుంటపాలెంలో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, బలుసుపాడు రోడ్డులోని జగనన్న లేఅవుట్‌లో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి రజిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.16,822 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతోపాటు వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్ పథకం పేరుతో గ్రామాల్లో ఇళ్ల వద్దే రోగులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పీహెచ్‌సీలు, 992 సీహెచ్‌సీలు ఆధునికీకరించామని తెలిపారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు వైద్యరంగానికి సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. జగ్గయ్యపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణానికి రెండు వైపులా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని, వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ పి.సరళమ్మ, డీసీహెచ్‌ఎస్ స్వప్న, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment