YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం | YS Jagan Mohan Reddy Samagika Bus Yathra | Sakshi
Sakshi News home page

YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం

Published Tue, Jan 30 2024 12:21 PM | Last Updated on Tue, Jan 30 2024 2:01 PM

YS Jagan Mohan Reddy Samagika Bus Yathra- Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. 

వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని
ఈ భారీ బహిరంగ సభలో  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే  వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు.

రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి  మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్‌లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా,  మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు.

ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని  నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిలకలూరిపేట  నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. 

చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం
ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి  దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు.

జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లెల రాజేశ్
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ,  రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో  పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement