సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి.
మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది.
కర్ణాటకలో నలుగురు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి
డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది.
తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
Published Thu, May 6 2021 5:24 AM | Last Updated on Thu, May 6 2021 5:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment