ఆస్పత్రి ముందు రోదిస్తున్న మృతుల బంధువులు
మైసూరు: దేశంలో మెడికల్ ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న దారుణ ఘటనలు ఆగేలాలేవు. ఇందుకు కొనసాగింపుగా కర్ణాటకలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 గంటల వ్యవధిలో 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 24 మందిలో 23 మంది కోవిడ్ బాధితులే. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రి ఆవరణం దద్దరిల్లింది. అయితే కోవిడ్ బాధితులందరూ ఆక్సిజన్ కొరత కారణంగానే మరణించారా? మరేదైనా ఆరోగ్య సమస్యా? అనేది ఇంకా నిర్ధారించలేదని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి అన్నారు.
ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి శివయోగి నేతృత్వంలో విచారణ చేపడతామని రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుల బంధువులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చామరాజనగర్ ఘటన కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ సోమవారం ఉదయం చామరాజనగర్ ఆస్పత్రిని పరిశీలించారు. కేవలం మగ్గురు ఆక్సిజన్ అందక మరణించారన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచించినట్లు హోం మంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.
రాహుల్ గాంధీ ఆగ్రహం
‘కోవిడ్ బాధితులు చనిపోయారా? లేక చంపేశారా?. బీజేపీ సర్కార్ మేల్కొనేలోపు ఇంకా ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాలి?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘యడియూరప్ప ప్రభుత్వం నిర్లక్ష్యంతో చేసిన హత్య ఇది’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment