chengalpattu
-
రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు
సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ చెన్నై సౌకార్‌పేట గోవిందప్పనాయకన్ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాంక్ క్యాషియర్ రూ.900 లకు బదులుగా నిర్మల్ కుమార్ స్నేహితుడి ఎకౌంట్‌కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్ కుమారు బ్యాంకు క్యాషియర్ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్ కుమార్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. -
ప్రాణం తీసిన ట్రయల్ రన్.. ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురి మృతి
సాక్షి, చెన్నై: కొత్త బైకును ట్రైల్ కోసం నడపడానికి తీసుకువెళ్లిన సమయంలో మినీ వ్యాన్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై పెరుముడి రాళ్లక్వారీ ప్రాంతానికి చెందిన నాగరాజు (25). ఇతని భార్య సుభ కుమారుడు భువిత్‌తో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటికి కొట్టివాక్కానికి చెందిన అన్నయ్య గాంధీ కుమారుడు బాలాజీ (18) ఇటీవల వచ్చాడు. శనివారం అర్ధరాత్రి విరాలిపాక్కం ప్రాంతంలో ఉన్న చర్చిలో యువకులు కేక్ కట్ చేసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. నాగరాజు, బాలాజీ ఇద్దరు ఇందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒక గంట సమయంలో అదే ప్రాంతానికి చెందిన జోష్వా అనే అతను కొత్త బైక్ తీసుకొచ్చాడు. ఆ కొత్త బైక్‌ను నడిపి చూస్తామని చెప్పి నాగరాజు తన అన్న కుమారుడు బాలాజీ, కరుంబాక్కంకు చెందిన విద్యార్థి రిసాక్ (15)తో కలి వెళ్లారు. తర్వాత చాలా సమయం అయినప్పటికీ వారు తిరిగి రాలేదు. అనుమానించిన చర్చి వద్ద వున్న యువకులు వారికోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు పక్కన మరమ్మతుకు గురై నిలిచి ఉన్న మినీ వ్యాన్ ఢీ కొట్టి నాగరాజు, ఇద్దరు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మృతి చెంది శవాలుగా పడి ఉన్నారు. స్థానిక పోలీసులు ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు
BA4 Variant India: కరోనా వైరస్ చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ దడ పుట్టిస్తోంది. కొత్త రూపం దాల్చుకొని ప్రజలపై పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే హమ్మయ్యా అనుకుంటున్న ప్రజలను బాబోయ్ అంటూ భయాందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు హైదరాబాద్‌లో వెలుగు చూడగా.. తాజాగా తమిళనాడులో రెండో కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ధృవీకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెంగళ్పట్టు జిల్లాలోని నవలూరుకు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. సంబంధిత వార్త: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కాగా బీఏ4 వేరియంట్ మొట్టమొదటిసారిగా 2022 జనవరి 10న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇండియా సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం ఈ నెల 23న బులెటిన్ విడుదల చేయనుంది. అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 లేదా BA.5 సోకిన వ్యక్తులకు కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఈ కొత్త వేరియంట్లు పెద్దగా ప్రమాదకరమైనవని కావని అభిప్రాయపడుతున్నారు. ఇక బీఏ.4 సబ్ వేరియంట్ హైదరాబాద్‌లో నమోదు అయిన విషయం తెలిసిందే. బీఏ.4 తొలికేసు వెలుగుచూసిన తర్వాత అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఈ వేరియంట్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వ్యక్తిలో లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు. -
పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని..
సాక్షి, చెన్నై : చెంగల్పట్టులో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. చెంగల్పట్టు పోలీసుస్టేషన్, పాత బస్టాండ్ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో అటువైపు వచ్చిన మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు జనం చూస్తుండగానే నరికి చంపేశారు. ( చదవండి: వివాహితతో యువకుడి చాటింగ్.. చివరికి ఇద్దరూ కూడా.. ) అక్కడి నుంచి పరుగులు తీసిన ఆ వ్యక్తులు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడి, అక్కడ ఉన్న ఓ వ్యక్తిని హతమార్చి పరారయ్యారు. జనం కళ్ల ముందే ఈ హత్యలు జరగడం కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు గురైన వారు అప్పు అలియాస్ కార్తికేయన్, అలగేశన్‌గా గుర్తించారు. వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
Government Land: పొరపాటున పట్టాలిచ్చారనడం సరికాదు
టీ.నగర్: చెంగల్పట్టు సమీపాన 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పట్టా చేసి అందజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అందులో చెంగల్పట్టు సమీపాన కరుంగుళిపల్లం అనే గ్రామంలోని 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 53 మందికి పట్టా చేసి అందజేశారని, ఈ స్థలం అపహరణ గురించి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా, ఈ కేసును స్థల అపహరణ కేసులను విచారించే ప్రత్యేక విభాగానికి పంపకుండా తిరుపోరూరు పోలీసు స్టేషన్‌కు పంపినట్లు తెలిపారు. వందల కోట్ల రూపాయిలు విలువచేసే ఈ స్థలం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే శివానందం, న్యాయవాదులు ఉన్నారని, అందుచేత తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని, తనకు భద్రత కల్పించేందుకు పోలీసులకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్, రామ్మూర్తి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది 105 ఎకరాల స్థలానికి పొరపాటున ప్రభుత్వ అధికారులు పట్టాలు అందజేశారని, ఈ పట్టాలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వాదనను న్యాయమూర్తులు నిరాకరించారు. 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పొరపాటున అధికారులు పట్టా చేసి ఇచ్చారనడం సమంజసం కాదని, సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ విచారణను జూన్ పదో తేదీకి వాయిదా వేశారు. చదవండి: ఆక్సిజన్ అందక 13 మంది మృతి -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
-
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కొనసాగుతుండగానే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో శుక్రవారం ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కాగా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్‌పై పలు పోలీస్స్టేషన్లలో పెరియార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. తమిళ మేగజీన్ ‘తుగ్లక్’ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలకు చెప్పుల దండలు వేసి నిర్వహించిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌పై ద్రవిడ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఖండించాయి. పెరియార్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల రజనీకాంత్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఆయన తాజా సినిమా ‘దర్బార్’ ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన పెరియార్ గురించి ఆచితూచి మాట్లాడాలని రజనీకాంత్‌కు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో అరంతంగి ప్రాంతంలో పెరియార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 2018, మార్చిలో వెల్లూరులోనూ పెరియార్ విగ్రహాన్ని నాశనం చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలోని పెరియార్ విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. చదవండి: ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి -
ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనం
కాంచీపురం సమీపాన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనమైంది. ఈమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిగా పోలీసులు కనుగొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాంచీ పురం సమీపాన పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం డీఎస్పీ బాలసుందరం, ఇన్స్పెక్టర్ లక్ష్మీపతి, తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం నుంచి పది అడుగుల దూరంలో రైల్వే లైన్‌కు దిగువ భాగాన ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలావుండగా ఆ యువతి వివరాలు రాబట్టారు. ఆమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని. ఈమె పేరు షకీనా(23). కాంచీపురం సమీపాన గల పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. కళాశాలలోని హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం ఉదయం ఆమె హఠాత్తుగా మాయమైనట్లు తెలిసింది. దీని తర్వాత ప్రస్తుతం శవంగా కనుగొన్నారు. ఆమె కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు.