దుండగుల దాడిలో ధ్వంసమైన పెరియార్ విగ్రహం
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కొనసాగుతుండగానే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు సమీపంలో శుక్రవారం ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కాగా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో పెరియార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు.
తమిళ మేగజీన్ ‘తుగ్లక్’ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలకు చెప్పుల దండలు వేసి నిర్వహించిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌పై ద్రవిడ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఖండించాయి. పెరియార్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల రజనీకాంత్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఆయన తాజా సినిమా ‘దర్బార్’ ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
కాగా, తమిళ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన పెరియార్ గురించి ఆచితూచి మాట్లాడాలని రజనీకాంత్‌కు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో అరంతంగి ప్రాంతంలో పెరియార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 2018, మార్చిలో వెల్లూరులోనూ పెరియార్ విగ్రహాన్ని నాశనం చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలోని పెరియార్ విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు.
Comments
Please login to add a commentAdd a comment