టీ.నగర్: చెంగల్‌పట్టు సమీపాన 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పట్టా చేసి అందజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అందులో చెంగల్‌పట్టు సమీపాన కరుంగుళిపల్లం అనే గ్రామంలోని 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 53 మందికి పట్టా చేసి అందజేశారని, ఈ స్థలం అపహరణ గురించి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా, ఈ కేసును స్థల అపహరణ కేసులను విచారించే ప్రత్యేక విభాగానికి పంపకుండా తిరుపోరూరు పోలీసు స్టేషన్‌కు పంపినట్లు తెలిపారు.
వందల కోట్ల రూపాయిలు విలువచేసే ఈ స్థలం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే శివానందం, న్యాయవాదులు ఉన్నారని, అందుచేత తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని, తనకు భద్రత కల్పించేందుకు పోలీసులకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్, రామ్మూర్తి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది 105 ఎకరాల స్థలానికి పొరపాటున ప్రభుత్వ అధికారులు పట్టాలు అందజేశారని, ఈ పట్టాలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వాదనను న్యాయమూర్తులు నిరాకరించారు. 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పొరపాటున అధికారులు పట్టా చేసి ఇచ్చారనడం సమంజసం కాదని, సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ విచారణను జూన్ పదో తేదీకి వాయిదా వేశారు.
చదవండి: ఆక్సిజన్ అందక 13 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment