
సాక్షి, చెన్నై: చెన్నై జలదిగ్బంధంపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ఐదేళ్లు ఏం చేశారంటూ కార్పొరేషన్ అధికారులపై ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా గుణపాఠం నేర్వరా..? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి ఆది కేశవులు బెంచ్ ముందు మంగళవారం చెన్నై నగరంలో రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్‌లలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా∙స్పందించారు.
2015లో చెన్నై నీట మునిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఐదేళ్లుగా ఏం చేశారు? అని కార్పొరేషన్ వర్గాల్ని ప్రశ్నించారు. ఒకసారి చెన్నై నీట మునిగినానంతరం, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదా..?, తీసుకుని ఉంటే, రెండు రోజుల వానకే జలదిగ్బంధంలో ఈ నగరం చిక్కేదా..? అని ప్రశ్నించారు. చెన్నైను వరద విలయం నుంచి గట్టెక్కించే పథకాలు చేపట్టలేరా..? అని ప్రశ్నిస్తూ, గుణపాఠం నేర్వాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో చెన్నైలో సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం కేసును ఎదుర్కోక తప్పదని కార్పొరేషన్ అధికారుల్ని సీజే బెంచ్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment