ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనం
కాంచీపురం సమీపాన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనమైంది. ఈమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిగా పోలీసులు కనుగొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాంచీ పురం సమీపాన పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం డీఎస్పీ బాలసుందరం, ఇన్‌స్పెక్టర్ లక్ష్మీపతి, తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మృతదేహం లభించిన ప్రాంతం నుంచి పది అడుగుల దూరంలో రైల్వే లైన్‌కు దిగువ భాగాన ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలావుండగా ఆ యువతి వివరాలు రాబట్టారు. ఆమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని. ఈమె పేరు షకీనా(23). కాంచీపురం సమీపాన గల పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. కళాశాలలోని హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం ఉదయం ఆమె హఠాత్తుగా మాయమైనట్లు తెలిసింది. దీని తర్వాత ప్రస్తుతం శవంగా కనుగొన్నారు.
ఆమె కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు.